Pakistan: పౌరులకు పాకిస్థాన్‌ షాక్‌.. పెట్రోల్‌పై ఒకేసారి రూ.35 పెంపు!

ఇంధన ధరల విషయంలో దేశవాసులకు పాక్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఒకేసారి లీటరుకు 35 పాకిస్థానీ రూపాయల చొప్పున పెంచింది.

Published : 30 Jan 2023 01:17 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభం(Economic Crisis)తో అతలాకుతలం అవుతోన్న పాకిస్థాన్‌(Pakistan).. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు, రాయితీల ఎత్తివేత, కరెంటు ఆదా వంటి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పౌరులకు మరో షాక్‌ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు 35 పాకిస్థానీ రూపాయల చొప్పున పెంచింది. పాక్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌(Ishaq Dar) ఆదివారం ఈ మేరకు ప్రకటన చేశారు. నేటి ఉదయం 11 గంటల నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సహాయ ప్యాకేజీతో పొందుపర్చిన షరతుల అమలుపై చర్చలు జరిపేందుకు ఐఎంఎఫ్‌ బృందం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఇస్లామాబాద్‌లో పర్యటించనున్న వేళ.. ఈ కీలక నిర్ణయం వెలువడింది.

‘గతే ఏడాది అక్టోబర్ నుంచి పెట్రోల్ ధరను పెంచలేదు. డీజిల్, కిరోసిన్ ధరలను తగ్గించాం. అయితే, ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్ ధరలను 35 పాకిస్థానీ రూపాయల చొప్పున పెంచాలని నిర్ణయించాం. కిరోసిన్‌‌, లైట్‌ డీజిల్‌ ఆయిల్‌ ధరలు 18 రూపాయల చొప్పున పెరిగాయి’ అని చెప్పారు. తాజా పెంపుతో పాక్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ.249.80, హైస్పీడ్ డీజిల్ రూ.262.80, కిరోసిన్ ఆయిల్ రూ.189.83, లైట్ డీజిల్ ఆయిల్ రూ.187 రూపాయలకు చేరింది. ధరల పెంపు ప్రకటన వెలువడిన వెంటనే బంకుల వద్ద వాహనదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మరోవైపు.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ధరల పెంపును విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు.

పాకిస్థాన్‌లో ప్రస్తుతం విదేశీ మారకపు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వీలుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి రుణాలు పొందేందుకు పాక్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాము నిధులివ్వాలంటే పాకిస్థాన్‌లో కరెంటు సబ్సిడీలను ఉపసంహరించాలని, అంతర్జాతీయ విపణి ధరలకు తగ్గట్టు గ్యాస్‌ ఛార్జీలను నిర్ణయించాలని, పాక్‌ రూపాయి మారక విలువను మార్కెట్‌ ఆధారంగా నిర్ణయించాలని, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎంఎఫ్‌ షరతులు పెట్టింది. వీటికి సంసిద్ధమేనని పాక్‌ ప్రధాని షెహబాద్‌ షరీఫ్‌ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ రూపాయి మారకపు రేటుపై నిబంధనలను సడలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని