Pakistan: భారత ఎన్నికలపై వ్యాఖ్యలు చేయబోం..: పాకిస్థాన్‌

భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జాహ్రా బలోచ్‌ తెలిపారు.

Published : 13 Jun 2024 22:59 IST

ఇస్లామాబాద్‌: భారత్‌లో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసి.. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరింది. అయితే.. ఈ ఎన్నికలపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని పాకిస్థాన్‌ (Pakistan) తెలిపింది. అదేవిధంగా భారత్‌ అంతర్గత వ్యవహారాలపైనా స్పందించబోమని పాక్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జాహ్రా బలోచ్‌ ఓ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

భారత్‌లో ఎన్నికల గురించి మీడియా ప్రతినిధులు స్పందన కోరగా.. ‘‘అక్కడ ఇటీవల ముగిసిన ఎన్నికలకు సంబంధించి, లేదా.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు’’ అని బలోచ్‌ బదులిచ్చారు. మోదీ విజయంపై ఇరుదేశాల ప్రధానుల మధ్య లేఖల మార్పిడి జరగలేదని.. అయితే, మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం శుభాకాంక్షలు తెలుపుతూ పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ ట్వీట్ చేశారని గుర్తుచేశారు. ‘కొత్తగా బాధ్యతలు చేపట్టిన దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలను అభినందించడం ఆనవాయితీ. ప్రధాని షరీఫ్ ఈమేరకు స్పందించారు. మోదీ కూడా బదులిచ్చారు. ఈ విషయంలో మరింత వివరణ ఇవ్వదల్చుకోలేదు’’ అని చెప్పారు.

భారత్‌లా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం..? పాక్‌ నేత వీడియో వైరల్‌

భారత ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన మోదీకి పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆయన సోదరుడు, అధికార పీఎంఎల్-ఎన్‌ అధినేత నవాజ్ షరీఫ్‌లు ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏడు పొరుగు దేశాలను ఆహ్వానించినప్పటికీ.. ఇస్లామాబాద్‌కు మాత్రం భారత్‌ ఆహ్వానం పంపలేదు. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని