Pakistan: పాక్‌లో నిలిచిన విద్యుత్‌ సరఫరా.. ఇబ్బందుల్లో ప్రజలు

పాక్‌(Pakistan)లో సోమవారం ఉదయం విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన నగరాలు కరెంటు కోతలను ఎదుర్కొంటున్నాయి. 

Published : 23 Jan 2023 11:59 IST

ఇస్లామాబాద్‌ : తీవ్ర ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటోన్న పాకిస్థాన్‌(Pakistan)కు సోమవారం ఉదయం మరో ఇబ్బంది ఎదురైంది. నేషనల్ గ్రిడ్‌(National Grid)లో భారీ వైఫల్యం చోటుచేసుకోవడంతో పాక్‌ ప్రజలు కరెంటు కోతలు(Power cuts) చవిచూశారు. ఈ మేరకు అక్కడి ఎనర్జీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

‘ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఉదయం 7.34 గంటల సమయంలో నేషనల్‌ గ్రిడ్‌లో వైఫల్యం ఎదురైంది. వోల్టేజ్‌లో హెచ్చుతగ్గులు ఈ పరిస్థితికి దారితీసింది. ఇదేమీ పెద్ద సంక్షోభం కాదు. వెంటనే పునరుద్ధరణ చర్యలు ప్రారంభమయ్యాయి. కొన్ని గ్రిడ్స్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి’ అని తన ప్రకటనలో పేర్కొంది. ప్రధాన నగరాలైన కరాచీ, ఇస్లామాబాద్‌, లాహోర్‌, పెషావర్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. 2021లో కూడా పాకిస్థాన్‌ ఈ తరహా గ్రిడ్ వైఫల్యాన్ని ఎదుర్కొంది. ఒకరోజు తర్వాత సాధారణ పరిస్థితికి చేరుకుంది.

తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోన్న పాక్‌(Pakistan).. దేశవ్యాప్తంగా చాలా గంటలపాటు కరెంటు కోతలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగం తగ్గించేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల పనివేళలను కుదించడంతోపాటు మాల్స్‌, ఫ్యాక్టరీలు కూడా తొందరగా మూసివేయాలని ఆదేశించింది. రాత్రివేళల్లో వేడుకలపైనా నిషేధం విధించింది.

ప్రస్తుతం పాక్(Pakistan) ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. అక్కడ మూడు వారాల దిగుమతులకు సరిపడా విదేశ మారక ద్రవ్యం మాత్రమే మిగిలి ఉంది. కరోనా, ప్రకృతి విపత్తులు ఆ దేశాన్ని కుంగదీశాయి. దాంతో అక్కడ గోధుమ పిండి కోసం తొక్కిసలాటలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని