Imran Khan: ఇమ్రాన్‌ను అరెస్టు చేస్తే పాక్‌ మరో శ్రీలంక అవుతుంది..

పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి దిశ లేదని, పరిస్థితిని చక్కదిద్దే సమర్థత కూడా లేదని విమర్శించారు. ఇమ్రాన్‌ని అరెస్టు చేస్తే జరిగే....

Published : 16 May 2022 22:55 IST

ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ని అరెస్టు చేస్తే పాకిస్థాన్‌ మరో శ్రీలంకగా మారుతుందని.. అందుకు కొత్త ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ హెచ్చరించారు. ఫైసలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి దిశ లేదని, పరిస్థితిని చక్కదిద్దే సమర్థత కూడా లేదని విమర్శించారు. ఇమ్రాన్‌ని అరెస్టు చేస్తే జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌ తెహ్రిక్‌-ఈ-ఇన్సాఫ్‌ (పీటీఐ) ఇప్పటికే ఓ వ్యూహాన్ని రచిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో అంతర్యుద్ధం సృష్టించేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రణాళికలు రచిస్తున్నారని, అలాంటి కుట్రలు చేస్తున్నందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ హెచ్చరించిన నేపథ్యంలో షేక్‌ రషీద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం సాధించాక చరిత్రలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక పరిస్థితిని ప్రస్తావిస్తూ.. షెహబాజ్‌ షరీఫ్‌ దేశ ఆర్థిక పరిస్థితిపై జాతినుద్దేశించి మాట్లాడాలని, ఐఎంఎఫ్‌ వద్దకు వెళ్తారో లేదో చెప్పాలని రషీద్‌ డిమాండ్‌ చేశారు. పాకిస్థాన్‌ డెమోక్రటిక్‌ మూమెంట్‌ (పీడీఎం) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పీటీఐ ప్రభుత్వాన్ని కూల్చడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌లో హీరో అయ్యారని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌ నాటికి ఎన్నికలు నిర్వహించి జాతీయ స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దేశ సంస్థలను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని