Pervez Musharraf: విమానంలో కూర్చొనే.. ప్రభుత్వాన్ని కూల్చిన ముషారఫ్‌!

Pervez Musharraf: పాక్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కన్నుమూశారు. కార్గిల్‌ యుద్ధ ప్రధాన కారకుడైన ఆయన నాటకీయ పరిణామాల మధ్య అప్పటి నవాజ్ షరీఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చారు.

Updated : 05 Feb 2023 20:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అది అక్టోబర్‌ 12, 1999. సమయం సాయంత్రం 6:45. విమానం ఎయిర్‌బస్‌ పీకే805. మొత్తం 198 మంది ప్రయాణికులతో పాక్‌కు వస్తోంది. అందులో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. మరో 10 నిమిషాల్లో విమానం దిగాల్సి ఉంది. కానీ, సమయం గడుస్తున్నా.. ల్యాండ్‌ చేయడానికి పైలట్‌కు అనుమతులు మాత్రం రావడం లేదు. కారణం అందులో నాటి పాక్‌ ఆర్మీ చీఫ్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ (Pervez Musharraf) ఉండడమే..! పైగా విమానాన్ని ల్యాండ్‌ కానివ్వొద్దని ఆదేశాలిచ్చింది స్వయంగా నాటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కావడం గమనార్హం. కట్‌ చేస్తే రాత్రి 8:45కల్లా పౌర ప్రభుత్వం కూలింది. షరీఫ్‌ను గృహనిర్బంధం చేశారు. ఆర్మీ సహకారంతో ల్యాండ్‌ అయిన ముషారఫ్‌ (Pervez Musharraf) దేశ పాలనా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇలా ముషారఫ్‌ (Pervez Musharraf) గాల్లో విమానంలో చక్కర్లు కొడుతుండగానే.. సైన్యానికి ఆదేశాలిచ్చి ప్రభుత్వాన్ని కూల్చేశారు. అనారోగ్యంతో దుబాయ్‌లో ముషారఫ్‌ (Pervez Musharraf) ఆదివారం మరణించిన వేళ ఆనాటి మిలిటరీ కుట్రకు దారితీసిన పరిస్థితులను చూద్దాం..

కార్గిల్‌ ఆక్రమణకు కుతంత్రాలు..

1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ముషారఫ్‌ (Pervez Musharraf) భారత్‌పై కోపం పెంచుకున్నారు. ఎలాగైనా భారత్‌ను దెబ్బకొట్టాలని కుట్రలు పన్నారు. ఈ క్రమంలో ఆయన కన్ను కార్గిల్‌ (Kargil)పై పడింది. కాలం కలిసిరావడంతో 1998 అక్టోబర్‌ 7వ తేదీన ముషారఫ్‌ (Pervez Musharraf)కు నాటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సైనిక పగ్గాలు అందించారు. బాధ్యతలు స్వీకరించిన ముషారఫ్‌ (Pervez Musharraf).. కొన్ని గంటల్లోనే కార్గిల్‌ (Kargil)పై దాడికి ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. కానీ, వారి కుట్రల్ని భారత బలగాలు ఎంత బలంగా తిప్పికొట్టాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ యుద్ధం పాక్‌కు అంతర్జాతీయంగా అవమానాన్ని మిగిల్చింది.

షరీఫ్‌, ముషారఫ్‌ మధ్య విభేదాలు

కార్గిల్‌ యుద్ధం షరీఫ్‌, ముషారఫ్‌ మధ్య విభేదాలకు దారితీసింది. కార్గిల్‌ (Kargil) పరాభవానికి పరస్పరం బహిరంగంగానే దుమ్మెత్తిపోసుకున్నారు. ఈ క్రమంలో ముషారఫ్‌ సైన్యంలో కీలక స్థానంలో ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ తారీఖ్‌ పర్వేజ్‌కు బలవంతంగా రిటైర్మెంట్‌ ఇప్పించారు. తారీఖ్‌ ప్రధాని షరీఫ్‌కు సమీప బంధువు. సైన్యంలోని అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తి. ముషారఫ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సైన్యం తిరుగుబాటు చేసే అవకాశం ఉందని ప్రధానికి తారీఖ్‌ చెప్పారు. దీంతో గత్యంతరం లేక జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా 2001వరకు ముషారఫ్‌ను నియమిస్తూ షరీఫ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

క్షీణించిన ప్రభుత్వ, సైనిక సంబంధాలు..

ముషారఫ్‌ను చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్స్‌గా నియమించడం అప్పటి నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ బొఖారీకి ఏమాత్రమూ నచ్చలేదు. కార్గిల్‌ (Kargil) యుద్ధం విషయంలోనూ ఆయన ముషారఫ్‌తో విభేదించారు. త్రివిధ దళాలను సంప్రదించకుండానే ముషారఫ్‌ ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని బహిరంగంగా ఆరోపించారు. ఈ క్రమంలో ముషారఫ్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై షరీఫ్‌తో బొఖారీ మాటలయుద్ధానికి దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వం, మిలిటరీకి మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఇది ఎక్కడ సైనిక తిరుగుబాటుకు దారితీస్తుందోనని భావించిన షరీఫ్‌.. ముషారఫ్‌ను తొలగించాలని నిర్ణయించుకున్నారు. సమయం కోసం వేచి చూశారు. మరోవైపు ముషారఫ్‌ కూడా ఈ విషయాలన్నింటినీ ఓ కంట కనిపెడుతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సైన్యంలో తన అనుచరులకు ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు.

మలుపు తిప్పిన శ్రీలంక పర్యటన..

అక్టోబరు 1999లో ముషారఫ్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లారు. దీన్ని అవకాశంగా భావించిన షరీఫ్‌.. ఆయన్ని తొలగించి జియాఉద్దీన్‌ బట్‌ను ఆ స్థానంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముషారఫ్‌ అసలు పాకిస్థాన్‌కు రాకుండా అడ్డుకోవాలని షరీఫ్‌ భావించారు. ముషారఫ్‌ వస్తున్న విమానాన్ని భారత్‌కు మళ్లించాలని ఆ దేశ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీకి ఆదేశాలు జారీ చేశారు. అక్టోబరు 12 సాయంత్రం 5 గంటలకు టీవీల్లో చూసి విషయం తెలుసుకున్న ఆర్మీలోని ముషారఫ్‌ అనుచరులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. కరాచీలోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచే ముషారఫ్‌ను కాంటాక్ట్‌ చేశారు. అప్పటికే విమానం ల్యాండింగ్‌కు అనుమతి దొరక్క సతమతమవుతున్న ముషారఫ్‌ తదుపరి కార్యాచరణను సిద్ధంచేశారు. ఆయన ఆదేశాలను అనుచరులకు అమలు చేస్తూ వెళ్లారు.  ప్రధాని నివాసం సహా ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.

మూడున్నర గంటల్లో కూలిన సర్కార్‌..

ఈ తతంగం 1999 అక్టోబరు 12 రాత్రి 7:45 గంటల కల్లా పూర్తయిపోయింది. 7:48 గంటలకు ముషారఫ్‌ సురక్షితంగా కరాచీలో ల్యాండ్‌ అయ్యారు. అప్పటికి విమానంలో కేవలం 7 నిమిషాలకు సరిపడా ఇంధన మాత్రమే ఉండటం గమనార్హం. అనంతరం సమీప సైనిక కార్యాలయానికి వెళ్లారు. సైన్యంలోని తన మద్దతుదారులతో సుదీర్ఘ మంతనాలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేసి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు. అర్ధరాత్రి 2:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇలా ఈ సైనిక నియంత పాక్‌ను దాదాపు పదేళ్లు పాలించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు