Pakistan: వారికి బిజినెస్‌ క్లాస్‌ లేదు.. ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉండొద్దు..!

పాకిస్థాన్‌(Pakistan) ఆర్థిక వ్యవస్థ దివాలా అంచున ఉంది. దాంతో వ్యయాలు తగ్గించుకునేందుకు అక్కడి ప్రభుత్వం అన్ని మార్గాలను వినియోగించుకుంటోంది. 

Published : 24 Feb 2023 19:00 IST

ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పాకిస్థాన్‌(Pakistan) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మంత్రుల వ్యయాలకు కోత పెట్టింది. వారు విమానాల్లో బిజినెస్‌ తరగతుల్లో ప్రయాణించవద్దని, ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల సదుపాయాలను వినియోగించవద్దని స్పష్టం చేసింది. అలాగే జీతంలో కోతకు ముందుకు వచ్చిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపింది. 

‘ఇప్పుడు ఈ వ్యయాలు తగ్గించడం అత్యవసరం. ప్రస్తుత సమయానికి తగ్గట్టుగా మనం వ్యవహరించాలి. నిరాడంబరంగా ఉంటూ కొన్ని త్యాగాలు చేయాలి’ అంటూ కేబినెట్‌ సమావేశంలో భాగంగా ప్రధాని షహబాజ్ షరీఫ్(Shehbaz Sharif ) వ్యాఖ్యానించారు. జులైలో ప్రవేశపెట్టే తదుపరి బడ్జెట్‌లో మరికొన్ని ఖర్చు తగ్గింపు చర్యలు ప్రటిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పలువురు కేంద్రరాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు జీతం తగ్గించుకోవడానికి, ప్రోత్సాహకాలను వదులుకోవడానికి ముందుకు వచ్చారని ప్రధాని వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది వరకు విలాస వస్తువులు, కార్ల కొనుగోలుపై నిషేధం ఉంటుందని తెలిపారు.

పాకిస్థాన్‌(Pakistan) కేంద్ర బ్యాంకు వద్ద విదేశ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయి. ఇవి కేవలం మూడు వారాల దిగుమతుల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి. ఈ సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి ఆర్థిక ప్యాకేజీ కోసం పాకిస్థాన్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఐఎంఎఫ్‌(IMF) కరుణ కోసం వివిధ రకాల పన్నుల పెంపుతో ‘మినీ బడ్జెట్‌’ను పాక్‌ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. తద్వారా దాదాపు నెల వ్యవధిలోనే రెండోసారి ఇంధన ధరలను పెంచినట్లయింది. సిగరెట్లు, ద్విచక్ర వాహనాలు, మొబైల్‌ ఫోన్లు, విమాన టికెట్లు వంటి వాటిపై పన్ను రేట్లు పెరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని