Published : 26 Apr 2022 01:51 IST

Sheikh Rashid: ‘పాకిస్థాన్‌లో పరిస్థితి గజిబిజి గందరగోళంగా ఉంది’

పాక్‌ చరిత్రలో అతి స్వల్ప ప్రభుత్వం ఇదే అవుతుందంటూ రషీద్‌ జోస్యం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సారథ్యంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వ పాలనలో దేశ పరిస్థితి గందరగోళంగా ఉందని పాక్‌ అంతర్గత వ్యవహారాల మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్‌ (ఏఎంఎల్‌) పార్టీ చీఫ్‌ షేక్‌ రషీద్‌ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పాకిస్థాన్‌ చరిత్రలోనే అతి తక్కువ కాలం అధికారంలో ఉన్నదిగా నిలుస్తుందని జోస్యం చెప్పారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పిలుపునిచ్చిన ఇస్లామాబాద్‌ మార్చ్‌ ప్రపంచాన్ని సర్‌ప్రైజ్‌కు గురిచేస్తుందని పేర్కొన్నారు. 

పీటీఐ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దెదించిన తర్వాత దేశంలో పరిస్థితి చాలా గజిబిజిగా, గందరగోళంగా మారిందని రషీద్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపించారు. జైళ్లలో ఉండాల్సిన వారిని కీలక పదవుల్లో నియమిస్తున్నారనీ.. దేశం గౌరవించాల్సిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని మండిపడ్డారు. అనుమానిత ఉగ్రవాదులకు సహాయం చేసిన ఆరోపణలపై బెయిల్‌పై ఉన్న కరాచీలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన అబ్దుల్‌ ఖాదిర్‌ పటేల్‌ను ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. స్థానిక నేతల ద్వారా పాకిస్థాన్‌లో ప్రభుత్వ మార్పునకు అమెరికానే కారణమంటూ ఆరోపణలు గుప్పించిన రషీద్‌.. సామ్రాజ్యవాద శక్తుల ఏజెంట్లు తమ నీచమైన పనుల్ని ఘనంగా చెప్పుకొంటున్నారని మండిపడ్డారు.

పాకిస్థాన్‌లో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరగడంతో ఆర్థికసంక్షోభానికి కారకులయ్యారంటూ ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య షెహబాజ్‌ షరీఫ్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.  అయితే,  పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉండగా.. అధికారంలో ఉండేందుకు కావాల్సిన సంఖ్యా బలం 172. అయితే, షెహబాజ్‌కు చెందిన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ పార్టీకి కేవలం 86 మంది సభ్యుల సంఖ్యా బలం మాత్రమే ఉంది. మిగతా సభ్యులంతా ఇమ్రాన్‌ ఖాన్‌ పాలన పట్ల వ్యతిరేకతతో షెహబాజ్‌ సారథ్యానికి మద్దతు ఇచ్చినవారే. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ఇచ్చిన వారందరినీ సంతృప్తిపరిచేలా పాలన అందించడం షెహబాజ్‌కు పెద్ద సవాలే. 

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని