Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌ సన్నిహితుడి అరెస్టు

పాక్‌(Pakistan )లో రాజకీయ అస్థిరత పెరిగిపోతోంది. ప్రతిపక్షనాయకులను ప్రభుత్వం అరెస్టు చేస్తోంది.

Published : 25 Jan 2023 23:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు ఫవాద్‌ చౌధరిని లాహోర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ అధినేత ఇమ్రాన్‌ను ప్రభుత్వం అరెస్టు చేయనుందని అతడు ప్రకటించిన కొద్దిసేపటికే  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మరోవైపు జమాన్‌ పార్క్‌లోని ఇమ్రాన్‌ ఇంటికి పార్టీ కార్యకర్తలు రాత్రంతా రక్షణగా ఉన్నారు. ఫవాద్‌ను పోలీసులు లాక్కెళుతున్న దృశ్యాలను పీటీఐ నేత ఫరూఖ్‌ హబీబ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఫవాద్‌ను ఇస్లామాబాద్‌కు తీసుకెళతారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

మరోవైపు ఇమ్రాన్‌ పార్టీకి చెందిన పీటీఐ నాయకులు జాతీయ అసెంబ్లీకి రాజీనామాలు చేయడం వివాదాస్పదంగా మారాయి. తొలుత వీరు రాజీనామా లేఖలు సమర్పించి.. తర్వాత వాటిని ఉపసంహరించుకొన్నారు. కానీ, పాక్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ రాజా పర్వేజ్‌ అష్రఫ్‌ మాత్రం 43 రాజీనామాలను ఆమోదించినట్లు ప్రకటించారు. దీంతో ఖాన్‌ పార్టీకి జాతీయ అసెంబ్లీ దిగువ సభలో ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. 

పాక్‌లో సోమవారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో దేశమంతా అంధకారంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నానికి కరెంటు ఉత్పత్తి, సరఫరా ప్రారంభమయిందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇస్లామాబాద్‌తో సహా దేశంలోని పలు చోట్ల విద్యుత్‌ కోతలు కొనసాగాయి. ఈ ఘటన వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలను ప్రధాని క్షమాపణలు కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, జాతీయ అసెంబ్లీలో రాజీనామాల వ్యవహారం ఆ దేశాన్ని మరింత అస్థిరత వైపు నెడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని