Nijjar killing: నిజ్జర్ హత్య వెనుక పాక్‌ ఐఎస్‌ఐ..!

భారత్‌, కెనడా మధ్య ఉద్రికత్తలకు కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక పాక్‌ ఐఎస్‌ఐ హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌ను దోషిగా చేయాలని ఐఎస్‌ఐ ఈ కుట్ర పన్ని ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

Updated : 27 Sep 2023 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యపై జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో భారత్‌, కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.  ఈ క్రమంలో నిజ్జర్ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో పాకిస్థాన్‌ (Pakistan) గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ (ISI) హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. భారత్‌-కెనడా మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకే ఐఎస్‌ఐ.. నిజ్జర్‌ను అంతమొందించి ఉంటుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

పాత వైరం కూడా..

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ నిజ్జర్‌కు కెనడాలో ఉంటున్న పాక్‌ ఐఎస్‌ఐ నిఘా ఏజెంట్లతో సంబంధాలున్నాయి. కెనడాకు వచ్చే తమ గ్యాంగ్‌స్టర్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఐఎస్‌ఐ గత కొన్నేళ్లుగా నిజ్జర్‌పై ఒత్తిడి పెంచుతోంది. కానీ, అతడు మాత్రం ఖలిస్థానీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. ఇక, స్థానికంగా పాపులారిటీ పెంచుకున్న అతడు.. డ్రగ్స్‌ అక్రమ దందాను నియంత్రిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిపై కోపం పెంచుకున్న ఐఎస్‌ఐ.. నిజ్జర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇందు కోసం ఇద్దరు ఏజెంట్లకు ఈ బాధ్యతను అప్పగించినట్లు నిఘా వర్గాల సమాచారం.

ట్రూడో సార్‌ గుర్తుందా.. ‘మీరు ఇది చదవాలనుకోరు’..!

ఇక, కెనడాలో నిజ్జర్‌ ఉంటున్న ప్రాంతానికి చుట్టుపక్కల ఐఎస్‌ఐ మాజీ అధికారులు నివసిస్తున్నట్లు తెలిసింది. వీరిలో మేజర్‌ జనరల్స్‌ నుంచి హవల్దార్‌ స్థాయి అధికారులు ఉన్నారట. వీరి ద్వారానే నిజ్జర్‌ కదలికలను తెలుసుకున్నట్లు సమాచారం.

ఈ ఏడాది జూన్‌లో హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (45) కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్‌ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. నిషేధిత ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌, ‘గురునానక్‌ సిక్‌ గురుద్వారా సాహిబ్‌’ అధిపతి అయిన హర్‌దీప్‌.. భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. అతడి తలపై రూ.10లక్షల రివార్డు ఉంది. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని