Imran Khan: పదేళ్లు జైల్లో ఉంచేందుకు ‘పాక్‌ ఆర్మీ’ పన్నాగం!

దేశద్రోహం పేరుతో పలు కేసులు నమోదు చేసి పదేళ్లపాటు తనను జైల్లో ఉంచేందుకు పాక్‌ సైన్యం (Pakistan Army) పన్నాగం పన్నిందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) ఆరోపించారు.

Updated : 15 May 2023 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ సైన్యంపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం పేరుతో తనను పదేళ్ల పాటు జైల్లో ఉంచేందుకు సైన్యం (Pakistan Army) కుట్ర పన్నిందని ఆరోపించారు. లండన్‌ పన్నాగం బహిర్గతమైందన్న ఖాన్‌.. తన చివరి రక్తం బొట్టు వరకు వంచకులకు వ్యతిరేకంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. వివిధ కేసుల్లో బెయిలు కోసం లాహోర్‌ హైకోర్టు ముందు ఇమ్రాన్‌ హాజరుకానున్నారు. ఇటీవల ఆయన అరెస్టు సమయంలో చెలరేగిన హింసను కారణంగా చూపుతూ తనను మరోసారి అరెస్టు చేసేందుకు ఆర్మీ పన్నాగం పన్నిందని పాక్‌ (Pakistan) మాజీ ప్రధాని ఆరోపిస్తున్నారు.

‘లండన్‌ వేదికగా పన్నిన కుట్ర బయటపడింది. నేను జైల్లో ఉన్న సమయంలో హింసను సాకుగా చూపి మరిన్ని చర్యలకు సిద్ధమయ్యారు. బుష్రాబేగంను (ఇమ్రాన్‌ భార్య) జైల్లో పెట్టి తనను అవమానించడంతోపాటు దేశద్రోహం పేరిట పదేళ్లు నన్ను జైల్లో పెట్టాలనేది వారి ప్లాన్‌’ అని ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిరసనలు తెలిపే వారిని అణచివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. పీటీఐ కార్యకర్తలతోపాటు సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తుండటంతోపాటు మీడియాను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పాక్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్‌ ఖాన్‌.. తన చివరి రక్తం బొట్టు వరకు స్వేచ్ఛ కోసం పోరాడతానన్నారు.

అంతకుముందు, పాక్‌ సైన్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్‌.. రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి సిగ్గుండాలని అన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే సొంతంగా పార్టీ పెట్టుకోవాలని హితవు పలికారు. తనకు కోర్టు బెయిలిచ్చినా.. పాక్‌ సైన్యాధిపతి జనరల్‌ అసీమ్‌ మునీర్‌ కిడ్నాప్‌నకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికలు వస్తే తుడిచిపెట్టుకుపోతామని ప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీలకు తెలుసని.. అందుకే దేశంలో అలజడులు సృష్టించడానికి కుట్ర పన్నాయని ఆరోపించారు. దాదాపు 100 కేసుల్లో బెయిల్‌పై ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ సోమవారం మరోకేసులో లాహోర్‌ కోర్టుకు హాజరుకానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని