Pakistan ISI: పాక్‌ నేతల ఫోన్‌కాల్స్‌పై ఐఎస్‌ఐ నిఘా.. అక్కడి పార్లమెంట్‌లో చట్ట సవరణ

పాక్‌ రాజకీయాల్లో సైన్యం వ్యతిరేకులను అణచివేసేందుకు వీలుగా ఆ దేశంలో కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం అక్కడి ఏ ఫోన్‌ కాల్స్‌ అయినా ఐఎస్‌ఐ ట్యాప్‌ చేయవచ్చు.

Published : 10 Jul 2024 16:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ (Pakistan) రాజకీయాలపై సైన్యం మరింత ఉడుంపట్టు బిగించింది. సైన్యం అధీనంలోని నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఇకనుంచి దేశీయంగా ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లను చూసేందుకు వీలుగా అక్కడి న్యాయశాఖ చట్ట సవరణలు చేసింది. దీంతో రాజకీయ నాయకుల వ్యక్తిగత కాల్స్‌ కూడా గోప్యంగా ఉండలేని పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే జులై 8న న్యాయశాఖ మంత్రి అజామ్‌ నజీర్‌ టెలికమ్‌ మంత్రిత్వ శాఖలో మార్పులు చేయాలని తాము సూచించినట్లు పార్లమెంట్‌కు వెల్లడించారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేవలం క్రిమినల్స్‌, ఉగ్రవాదులను ట్రాక్‌ చేయడానికే ఈ చర్యలు తీసుకొన్నట్లు చెబుతున్నారు. ప్రజాజీవితంలో జోక్యం చేసుకోవడానికి తాము దీనిని తీసుకురాలేదని నజీర్‌ పేర్కొన్నారు. 

మరోవైపు పాక్‌లోని ప్రతిపక్షాలు మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిని ఒక నల్ల చట్టంగా అభివర్ణించాయి. ముఖ్యంగా ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ నాయకుడు ఒమర్‌ అయూబ్‌ ఖాన్‌ మాట్లాడుతూ ఏజెన్సీలు చట్టసభ సభ్యులపైనే వీటిని ప్రయోగిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. ఈ ఆరోపణలపై ఆర్మీకి చెందిన పీఆర్‌ విభాగం ఐఎస్‌పీఆర్‌ మాత్రం స్పందించలేదు. గతంలో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఐఎస్‌ఐ ట్యాప్‌ చేసిందనే ఆరోపణలున్నాయి. ఇక పీటీఐ చీఫ్‌ గోహర్‌ ఖాన్‌ మాట్లాడుతూ ఇలాంటి మూకుమ్మడి నోటిఫికేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. 

పాక్‌ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా ఆసీఫ్‌ మాత్రం ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మిలిటెన్సీ హింసను రూపుమాపాలంటే ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల భయాలను ఆయన కొట్టిపారేశారు. గతంలో ఇమ్రాన్‌ ప్రభుత్వం కూడా ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుకూలంగానే వ్యవహరించిందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని