Nikhil Gupta: పన్నూ హత్యాయత్నం కేసు..కోర్టుకు హాజరైన నిఖిల్‌ గుప్తా

ఖలిస్థానీ తీవ్రవాది గురు పత్వంత్‌ సింగ్‌ పన్నూను అంతమొందించడానికి ఒక కిరాయి హంతకుడిని నియోగించాడనే ఆరోపణను ఎదుర్కొంటున్న భారత పౌరుడు నిఖిల్‌ గుప్తా (52)ను చెక్‌ రిపబ్లిక్‌ గత వారాంతంలో అమెరికాకు అప్పగించింది.

Published : 18 Jun 2024 04:49 IST

వాషింగ్టన్‌: ఖలిస్థానీ తీవ్రవాది గురు పత్వంత్‌ సింగ్‌ పన్నూను అంతమొందించడానికి ఒక కిరాయి హంతకుడిని నియోగించాడనే ఆరోపణను ఎదుర్కొంటున్న భారత పౌరుడు నిఖిల్‌ గుప్తా (52)ను చెక్‌ రిపబ్లిక్‌ గత వారాంతంలో అమెరికాకు అప్పగించింది. ప్రస్తుతం బ్రూక్లిన్‌ లోని ఫెడరల్‌ మెట్రోపాలిటన్‌ నిర్బంధ కేంద్రంలో ఉన్న గుప్తాను సోమవారం న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా, కెనడాల పౌరసత్వం గల పన్నూను హతమార్చడానికి గుప్తా ముందస్తుగా 15,000 డాలర్లు ఇచ్చి ఒక కిరాయి హంతకుడిని నియోగించాడని అమెరికా ఫెడరల్‌ ప్రాసిక్యూటర్ల ఆరోపణ. తనపై అన్యాయంగా అభియోగాన్ని మోపారని గుప్తా వాదిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం కోరిన మీదట ఆయన్ను చెక్‌ రిపబ్లిక్‌ నిరుడు అరెస్ట్‌ చేసింది. తనను అమెరికాకు అప్పగించకూడదని గుప్తా చేసిన విన్నపాన్ని చెక్‌ రాజ్యాంగ కోర్టు గత నెలలో తోసిపుచ్చింది. భారత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి ఆదేశం మేరకు పన్నూ హత్యకు గుప్తా కుట్రపన్నాడని ప్రాసిక్యూషన్‌ ఆరోపిస్తోంది. పన్నూ హత్యాయత్నంలో తమ ప్రమేయం లేదని భారత ప్రభుత్వం మొదటి నుంచీ స్పష్టం చేస్తోంది. అధునాతన, కీలక టెక్నాలజీలపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో చర్చలు జరపడానికి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ దిల్లీకి వచ్చిన సమయంలో నిఖిల్‌ గుప్తా కోర్టులో హాజరు కానుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని