Mt Everest: ఎవరెస్టుపైకి 26 సార్లు.. ప్రపంచ రికార్డు సమం చేసిన నేపాలీ షెర్పా!

ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని 26వసారి అధిరోహించారు నేపాల్‌కు చెందిన షెర్పా పసంగ్‌ దావా లామా. దీంతో గతంలో ఇదే దేశానికి చెందిన మరో షెర్పా కామీ రీటా సాధించిన ప్రపంచ రికార్డును సమం చేసినట్లయ్యింది.

Published : 15 May 2023 00:03 IST

ఖాఠ్‌మండూ: ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరం ‘ఎవరెస్టు (Mount Everest)’ను అధిరోహించడమంటే ఎంతో సాహసంతో కూడుకున్నది. అలాంటిది.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 సార్లు ఈ శిఖరాగ్రంపై కాలుమోపి ప్రపంచ రికార్డును సమం చేశారో నేపాలీ షెర్పా (Sherpa). ఆయనే.. పసంగ్‌ దావా (Pasang Dawa). అంతకుముందు ఈ దేశానికే చెందిన మరో షెర్పా కామీ రీటా (Kami Rita) ఈ రికార్డును నెలకొల్పారు. 1953లో న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ, అతని గైడ్‌ టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి అధిరోహించిన 70వ వార్షికోత్సవం సందర్భంగా పసంగ్‌ దావా (47) ఈ ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం.

పసంగ్‌ దావా 1998లో మొదటిసారి ఎవరెస్టు ఎక్కారు. తాజాగా ఓ హంగేరియన్ పర్వతారోహకుడితో కలిసి ఆదివారం ఉదయం 26వసారి శిఖరం అంచుకు చేరుకున్నారు. అయిదుగురు విదేశీయులతోసహా మొత్తం 19 మంది పర్వతారోహకులు ఈ వారాంతంలో ఎవరెస్టును అధిరోహించారు. ఈ ఏడాది వసంతకాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు నేపాల్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 466 అనుమతులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే వారి కోసం షెర్పాలు.. శిఖరం పైవరకు తాళ్లను, మార్గాలను సిద్ధం చేశారు. మరోవైపు.. రీటా కామీ సైతం ప్రస్తుతం ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో ఉన్నారు. రికార్డు స్థాయిలో 27వసారి ఈ శిఖరాన్ని ఎక్కేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని