Ryanair Airlines: విమానంలో ఘర్షణకు దిగిన ప్రయాణికులు.. అత్యవసర ల్యాండింగ్‌

విమానంలో ప్రయాణికులు పరస్పరం దాడులకు దిగడంతో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

Published : 08 Jul 2024 19:55 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ నెలకొనడంతో టేకాఫ్‌ అయిన అరగంటకే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం ర్యాన్‌ఎయిర్(Ryanair) విమానం బుధవారం మొరాకోలోని అగాదిర్‌ నుంచి లండన్‌(London)కు బయల్దేరింది.

ఇంతలో ఓ వ్యక్తి.. మహిళా ప్రయాణికురాలి దగ్గరకు వచ్చి తన భార్య, పిల్లలతో కూర్చోవడానికి సీటును ఇవ్వాల్సిందిగా అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో బెదిరింపులకు దిగాడు. మహిళ భర్త అతడిని వారించడంతో వాగ్వాదం నెలకొంది. మహిళ బంధువులు సైతం అదే విమానంలో ఉండడంతో వారు సదరు వ్యక్తితో గొడవకు దిగారు.

వారు ఒకరిని ఒకరు దూషించుకుంటూ దాడికి దిగుతుండటంతో ఇతర ప్రయాణికులు, పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానాన్ని మరకేష్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. విమానంలోని ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ విమానంలో ఉన్న 36 నిమిషాలు ఒక నరకంలాగా అనిపిందని, పిల్లలు భయంతో ఏడుస్తూనే ఉన్నారని వాపోయారు. 

ఇదిలా ఉండగా మరో ప్రయాణికుడు అస్వస్థతకు గురవ్వడంతో మరకేష్‌లో విమానం ల్యాండ్‌ అయిన వెంటనే వైద్యులు అతడికి ఆక్సిజన్‌ పెట్టారు. ఆరోగ్యం సరిగ్గా లేనందున విమానం దిగాల్సిందిగా కోరగా అందుకు నిరాకరించాడు. అయితే, ఎట్టకేలకు అధికారులు అతడిని విమానం నుంచి దించారు. ఈ ఘటనలతో విమానం లండన్‌ చేరుకోవడానికి ఆలస్యమైంది.

దీనిపై ర్యాన్‌ఎయిర్ అధికారులు స్పందిస్తూ ‘‘అనారోగ్యానికి గురైన వ్యక్తికి వైద్యం చేయడానికి, విమానాన్ని తిరిగి టేకాఫ్‌ చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. అప్పటికే చీకటి పడటంతో ప్రయాణికులకు వసతి సౌకర్యం కల్పించాం. మరుసటి రోజు విమానం లండన్‌కు బయల్దేరింది. కొందరి వల్ల ఇతర ప్రయాణికులకు జరిగిన ఆలస్యానికి, అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని