Published : 05 Aug 2022 12:44 IST

Nancy Pelosi: తైవాన్‌కు వెళ్లకుండా మమ్మల్ని ఆపడం చైనా తరం కాదు.. : పెలోసీ

టోక్యో: చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్‌ పర్యటనను విజయవంతంగా ముగించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ మరోసారి డ్రాగన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్‌కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదన్నారు. ఆ దేశాన్ని ఏకాకి చేస్తానంటే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు.

ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్న నాన్సీ పెలోసీ.. టోక్యోలో విలేకరులతో మాట్లాడారు. ‘తైవాన్‌ను ఒంటరి చేయాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆ ద్వీప దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేరకుండా అడ్డుకుంది. తైవాన్‌ దేశస్థులు ఎక్కడకీ వెళ్లకుండా.. ఎందులోనూ పాల్గొనకుండా వారు(డ్రాగన్‌ను ఉద్దేశిస్తూ) అడ్డుకోగలరేమో.. కానీ, మమ్మల్ని అక్కడకు వెళ్లకుండా అడ్డుకోలేరు. నా పర్యటనతో ద్వీప దేశంలో యథాతథ స్థతిని మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ, అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలన్నదే మా ప్రయత్నం’’ అని పెలోసీ చెప్పుకొచ్చారు.

చైనాది రెచ్చగొట్టే చర్యే: అమెరికా

డ్రాగన్‌ హెచ్చరికలను పట్టించుకోకుండా పెలోసీ తైవాన్‌లో పర్యటించడంతో చైనా ప్రతీకార చర్యలకు పాల్పడింది. తైవాన్‌పై ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంతో పాటు గురువారం నుంచి ఆ ద్వీపదేశం చుట్టూ భారీ సైనిక విన్యాసాలు ప్రారంభించారు. చైనా డ్రిల్స్‌ కారణంగా అనేక విమానాలు దారిమళ్లించుకోవాల్సి వచ్చింది. కాగా.. ఈ పరిణామాలపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాది పూర్తిగా రెచ్చగొట్టే చర్యేనని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అన్నారు. కొలంబియాలో జరుగుతోన్న తూర్పు ఆసియా సదస్సుల్లో బ్లింకెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌తో పాటు దాని పొరుగుదేశాలను కూడా డ్రాగన్‌ భయపెట్టాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

ఆసియా పర్యటనలో భాగంగా నాన్సీ పెలోసీ గత మంగళవారం తన బృందంతో కలిసి తైవాన్‌ రాజధాని తైపేలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే తైవాన్‌ తమ భూభాగమే అని చెబుతూ వస్తోన్న డ్రాగన్‌.. ఈ పర్యటనపై ముందు నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని, ఇందుకు ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తైవాన్‌ జలసంధిలోనే గురువారం నుంచి మిలిటరీ డ్రిల్స్‌ చేపట్టింది. అయితే చైనా చర్యలపై తైవాన్‌ కూడా దీటుగానే బదులిచ్చింది. తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని.. కానీ, ఆ పరిస్థితులు ఎదురైతే తాము సిద్ధమేనని స్పష్టం చేసింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని