Ukraine Crisis: కీవ్‌లో నాన్సీ పెలోసీ ఆకస్మిక పర్యటన..!

అమెరికా అత్యున్నత నాయకత్వంలోని కీలక వ్యక్తులు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ పర్యటనలకు వెళుతున్నారు. తాజాగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ కీవ్‌లో ఆకస్మికంగా పర్యటించారు.

Published : 01 May 2022 19:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అత్యున్నత నాయకత్వంలోని కీలక వ్యక్తులు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ పర్యటనకు వెళుతున్నారు. తాజాగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ కీవ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఆమె రాకకు సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను జెలెన్‌స్కీ స్వయంగా ట్విటర్‌లో షేర్‌ చేశారు. రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నందుకు అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పర్యటనలో పెలోసీతోపాటు అమెరికా కాంగ్రెస్‌లోని కీలక సభ్యులు ఉన్నారు. 

పెలోసీ కార్యాలయం కూడా కీవ్‌ పర్యటనను ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. పెలోసీ కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించినట్లు వెల్లడించింది. ‘‘ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో జెలెన్‌స్కీని కలిసే అద్భుత అవకాశం వచ్చింది. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌ వాసులకు, వారికి నాయకత్వం వహిస్తున్న జెలెన్‌స్కీకు అభినందనలు తెలియజేశాము. మేము అమెరికాకు చేరుకోగానే ఉక్రెయిన్‌కు మద్దతుగా ఏమీ చేయదలుచుకొందీ వెల్లడిస్తాము. ఉక్రెయిన్‌ వాసుల పోరాటంతో స్పూర్తిపొందాము. వారికి అవసరమైన సాయం అందిస్తాము’’ అని ఆ ప్రకటనలో పేర్కొ్న్నారు. ఈ పర్యటన అనంతరం కాంగ్రెస్‌ బృందం పోలాండ్‌కు చేరుకొంది. 

ఉక్రెయిన్‌లో వీఐపీలు పర్యటించిన ప్రతిసారి రష్యా దాడుల తీవ్రతను పెంచుతోంది. గతంలో ఐరోపా దేశాధినేతలు ప్రయాణించిన సమయాల్లో రైల్వే స్టేషన్లపై దాడులు జరిగాయి. గత వారం అమెరికా మంత్రులు ఆంటోనీ బ్లింకెన్‌, లాయిడ్‌ ఆస్టిన్‌లు పర్యటించిన సమయంలో కూడా రైల్వే స్టేషన్లపై క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇటీవల ఐరాస చీఫ్‌ గుటెరస్‌ కీవ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే రెండు క్షిపణలు  అక్కడి భవనాలను ధ్వంసం చేశాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు