India-US: ఆ విషయంలో భారత్‌ను ప్రోత్సహించలేం: అమెరికా

భారత్‌-రష్యా బంధంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది...

Published : 24 Apr 2022 01:42 IST

వాషింగ్టన్‌: భారత్‌-రష్యా బంధంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌ తన రక్షణ అవసరాల నిమిత్తం రష్యాపై ఆధారపడడాన్ని అమెరికా ఏమాత్రం పోత్సహించడం లేదని ఆ దేశ రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌ అభిప్రాయపడింది.

2018లో భారత్‌ ఎస్‌-400 గగనతల క్షిపణి వ్యవస్థ కొనుగోలు నిమిత్తం రష్యాతో ఐదు బిలియన్‌ డాలర్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని అమెరికా అప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. అయినప్పటికీ.. పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని భారత్‌ ఈ విషయంలో ముందుకే వెళ్లింది. ఇదే ఎస్‌-400 వ్యవస్థల్ని కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ‘కాట్సా’ ఆంక్షల్ని ప్రయోగించింది.

‘‘రక్షణ అవసరాల నిమిత్తం భారత్‌ సహా ఏ దేశమూ రష్యాపై ఆధారపడొద్దు. ఈ విషయంలో మా వైఖరిని నిక్కచ్చిగా, స్పష్టంగా తెలియజేశాం. దీన్ని మేం ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. అదే సమయంలో భారత్‌తో ఉన్న మా రక్షణ భాగస్వామ్యానికి విలువిస్తాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం. అది మాకు చాలా ముఖ్యం. ప్రాంతీయంగా భారత్‌ ఓ రక్షణ ఛత్రంలా పనిచేస్తోంది. దానికి మేం విలువిస్తున్నాం’’ అని పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా విషయంలో అమెరికా చాలా తీవ్రంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కఠిన ఆర్థిక ఆంక్షల్ని ప్రయోగించింది. అదే సమయంలో ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. ఇరు దేశాలు శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికింది. కానీ, ఈ భారత వైఖరి పట్ల అమెరికా అసంతృప్తిగా ఉంది. పలుసార్లు భారత్‌-రష్యా బంధంపై భిన్న వ్యాఖ్యలు చేసింది. ఓసారి రష్యాతో భారత్‌కు ఉన్న ప్రత్యేక బంధాన్ని అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. మరోసారి రష్యాతో భారత్‌ బంధాన్ని కొనసాగించడంపై విమర్శలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని