Israel: ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు!

ఇజ్రాయెల్‌ న్యాయవ్యవస్థ(Judicial System)లో మార్పుల కోసం ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) తీసుకొస్తున్న కొత్త న్యాయ చట్టంపై ఆయనకు వ్యతిరేకంగా  ఉద్యోగ సంఘాలు, ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. 

Published : 27 Mar 2023 20:03 IST

జెరూసలేం: ఇజ్రాయెల్‌ (Israel) ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu)కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. వేల మంది ప్రజలు రాజధాని జెరూసలేంలోని ప్రధాన వీధుల్లోకి వచ్చి ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదానాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్  రక్షణశాఖ మంత్రి యోవ్‌ గాలాంట్‌(Yoav Gallant )ను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత ఈ నిరసనలు మొదలయ్యాయి.

ఇజ్రాయెల్‌ న్యాయవ్యవస్థ(Judicial System)లో మార్పుల కోసం నెతన్యాహు ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాన్ని యోవ్‌ గాలాంట్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన్ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్‌ చేస్తున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెతన్యాహుకు వ్యతిరేకంగా వేల మంది ప్రజలు ఇజ్రాయెల్‌ జాతీయజెండాలు పట్టుకుని ప్రధాన వీధుల్లో నిరసనలు చేపట్టడంతో, వారిని చెదరగొట్టేందుకు సైన్యం జల ఫిరంగులను ప్రయోగించింది. 

ప్రధాని నెతన్యాహు ప్రవేశపెట్టిన కొత్త చట్టం కారణంగా న్యాయమూర్తుల నియామకాలపై ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంటుంది. దీనివల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత ఉండదని అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అవినీతి ఆరోపణల కేసులో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహు,  తన స్వప్రయోజనాల కోసమే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, కోర్టులు తమ పరిధి దాటి వ్యవహరించకుండా అడ్డుకునేందుకే ఈ సంస్కరణలు తెస్తున్నామని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టాన్ని ఇజ్రాయెల్‌ సైనిక బలగాలతోపాటు న్యాయ సంఘాలు, పలు ఉద్యోగ యూనియన్లు, ప్రజలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాని నెతన్యాహు మాత్రం వీలైనంత త్వరగా చట్టాన్ని ఆమోదింపచేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

ఈ ఆందోళనలకు ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించడంతో విమానాల రాకపోకలను అంతరాయం కలుగుతోందని ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది. దాంతోపాటు దేశంలోని అతిపెద్ద ట్రేడ్‌ యూనియన్‌ కూడా మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆందోళనలు ఎక్కువరోజులు కొనసాగితే అది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో నిరసనలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరింది. 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు