Canada : కెనడాలో స్థిరపడిన భారతీయులకు మరిన్ని ఉద్యోగావకాశాలు..!

పౌరసత్వం పొందిన విదేశీయులు సైన్యంలో చేరడానికి కెనడా అనుమతి మంజూరు చేసింది. అక్కడ సైన్యంలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

Updated : 14 Nov 2022 13:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడాలో పౌరసత్వం పొందిన విదేశీయులకు ఆ దేశ సైన్యం ఓ శుభవార్త చెప్పింది. పౌరసత్వం పొందిన విదేశీయులు సైన్యంలో చేరడానికి అనుమతి మంజూరు చేసినట్లు ప్రకటించింది. అక్కడ సైన్యంలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఐదేళ్ల క్రితమే అక్కడ ఉన్న ‘ది రాయల్‌ కెనేడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌’ పాత నియామక విధానాన్ని వదిలేసింది. పౌరసత్వం పొందిన విదేశీయులు చేరేందుకు అనుమతి ఇచ్చేసింది. తాజాగా కెనడా సైన్యం కూడా ఈ అవకాశం కల్పించడంతో అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నభారతీయులకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.

గతంలో పౌరసత్వాలు పొందిన విదేశీయులను ‘ది స్కిల్డ్‌ మిలటరీ ఫారెన్‌ అప్లికెంట్’ అనే ప్రోగ్రాం కిందే నియమించుకునేవారు. కెనడా సైన్యంలో ప్రత్యేక అవసరాలు తీర్చేవారు, తక్కువ శిక్షణ అవసరమైన వారిని నియమించుకొనే వారు. ముఖ్యంగా పైలట్లు, డాక్టర్లు వంటి ఉద్యోగాలు లభించేవి. కానీ, తాజా నిర్ణయంతో కెనడాలో పౌరసత్వం లభించి.. 18 ఏళ్లు నిండిన వారికి లేదా 16 ఏళ్లు నిండి తల్లిదండ్రుల అనుమతి ఉన్నవారికి సైన్యంలో అవకాశాలు లభిస్తాయి. వీరు 10 లేదా 12వ గ్రేడ్‌ విద్యను పూర్తి చేసి ఉండాలి. 

నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయని ది కెనేడియన్‌ ఆర్మ్‌డు ఫోర్సెస్‌ సెప్టెంబర్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారిలో కేవలం సగం మంది అభ్యర్థులు మాత్రమే లభిస్తున్నారని పేర్కొంది. రానున్న కాలంలో నెలకు 5,900 నియామకాలు చేపడితేగానీ అవసరాలు తీరవని పేర్కొంది. రష్యా చేపట్టిన యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితులతో కెనడా సైన్యం విస్తరించాల్సిన పరిస్థితి నెలకొందని ఆ దేశ రక్షణ మంత్రి అనితా ఆనంద్‌ ఈ ఏడాది మార్చిలో పేర్కొన్నారు. ఇటీవల కెనడా వలసల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించింది. 2023-25 మధ్యలో 5 లక్షల మంది వలసదారులకు పౌరసత్వాలు ఇవ్వాలని ఇటీవల నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని