Pervez Musharraf: ఆ ఔషధం పాక్‌లో లేదు.. అందుకే ముషారఫ్‌ రాలేరు..!

అత్యంత అరుదైన వ్యాధి అమైలాయిడోసిస్‌తో భాధపడుతున్న ముషరఫ్‌ జీవితం చరమాంకంలో స్వదేశానికి వెళ్లే అవకాశాలు మూసుకుపోయాయి. తీవ్ర అనారోగ్యం కారణంగా గత మూడు వారాలుగా ఆయన దుబాయ్‌లోని

Updated : 20 Jun 2022 13:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  అత్యంత అరుదైన వ్యాధి అమైలాయిడోసిస్‌తో భాధపడుతోన్న పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ జీవితం చరమాంకంలో స్వదేశానికి వెళ్లే అవకాశాలు మూసుకుపోయాయి. తీవ్ర అనారోగ్యం కారణంగా గత మూడు వారాలుగా ఆయన దుబాయ్‌లోని ఆసుపత్రికే పరిమితం అయ్యారు. ఈ సమయంలో ఆయన పాకిస్థాన్‌కు వెళ్లాలనుకున్నా.. తొలుత సైన్యం, రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. కానీ, చివరికి అధికారులు.. ఆయన రాకకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కానీ, ఆయన చికిత్సకు అవసరమైన కీలక ఔషధం పాకిస్థాన్‌లో అందుబాటులో లేదు. దీంతో దుబాయ్‌కే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది.

అమైలాయిడోసిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న  ఆయనలో అసాధారణ స్థాయిలో ప్రొటీన్లు పోగుపడి అవయవాలను దెబ్బతీస్తాయి. ఈ వ్యాధి చికిత్సకు  ఆయనకు ప్రయోగాత్మకంగా దారాతుముమాబ్‌ అనే ఔషధాన్ని వినియోగిస్తున్నారు. ఈ ఔషధం పాకిస్థాన్‌లో అందుబాటులో లేదు. దీంతో ఆయన పాక్‌కు రాలేని పరిస్థితి. ముషారఫ్‌ కొన్ని వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యలు వివరించారు. ఆయన చనిపోయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో వారు ఈ మేరకు స్పందించారు. 

1999లో సైనిక తిరుగుబాటు ద్వారా నాటి ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ను పదవీచ్యుతుడిని చేసి, అధికారాన్ని ముషారఫ్‌ హస్తగతం చేసుకున్నారు. 2008 వరకూ దేశాన్ని పాలించారు. ఆ ఏడాది ఎన్నికల అనంతరం ఉద్వాసన ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో, లాల్‌ మసీదు మతపెద్ద అబ్దుల్‌ రషీద్‌ ఘాజీల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసినందుకు ఆయనపై దేశద్రోహం అభియోగాన్ని కూడా మోపారు. చికిత్స కోసం ఆయన 2016లో దుబాయ్‌ వెళ్లారు. అప్పటినుంచి స్వదేశానికి తిరిగిరాలేదు. దీంతో న్యాయస్థానం ఆయనను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని