Pfizer: ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ ‘ఒమిక్రాన్‌ టీకా’ క్లినికల్‌ట్రయల్స్‌ షురూ

ప్రత్యేకంగా ‘ఒమిక్రాన్‌’ నుంచి రక్షణ కల్పించేందుకు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్లు ఫైజర్‌- బయోఎన్‌టెక్ సంస్థలు మంగళవారం వెల్లడించాయి. 18-55 మధ్య వయసున్న 1,420 మందిపై ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. ‘బూస్టర్‌ డోసులు...

Published : 25 Jan 2022 23:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రత్యేకంగా ‘ఒమిక్రాన్‌’ నుంచి రక్షణ కల్పించేందుకు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్లు ఫైజర్‌- బయోఎన్‌టెక్ సంస్థలు మంగళవారం వెల్లడించాయి. 18-55 మధ్య వయసున్న 1,420 మందిపై ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. ‘బూస్టర్‌ డోసులు.. ఒమిక్రాన్‌ తీవ్రతను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆయా అధ్యయనాలు, రియల్‌ టైం డేటాలో తేలింది. అయినప్పటికీ.. ఈ రక్షణ క్రమంగా క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో.. ఒమిక్రాన్‌, ఇతర కొత్త వేరియంట్లను పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాం. ఈ దిశగా అడుగులు వేస్తున్నాం’ అని ఫైజర్‌ వ్యాక్సిన్ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ హెడ్ కాథ్రిన్ జాన్సెన్ ఓ ప్రకటనలో తెలిపారు.

‘మునుపటి వేరియంట్ల నుంచి కాపాడుతోన్న వ్యాక్సిన్‌ల రక్షణ.. ఒమిక్రాన్‌ విషయంలో వేగంగా తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వేరియంట్ ఆధారిత వ్యాక్సిన్‌ అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. కొత్త వ్యాక్సిన్‌ ఒమిక్రాన్ నుంచి దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది’ అని బయోఎన్‌టెక్ సీఈవో ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్ చెప్పారు. మార్చి నాటికి ఈ టీకా ఆమోదానికి సిద్ధంగా ఉండొచ్చని ఫైజర్‌ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ఇటీవల ఓ సమావేశంలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. వేగంగా వ్యాప్తి చెందుతూ, ఆయా దేశాల్లో మరో ఉద్ధృతికి కారణమైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఇంకా పెరుగుతున్నప్పటికీ.. చాలా దేశాలు ఒమిక్రాన్ తీవ్రత నుంచి క్రమంగా బయటపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని