Ukraine Crisis: రష్యాలో పెట్టుబడులు నిలిపివేస్తాం.. లాభాలను ఉక్రెయిన్‌కు ఇస్తాం: ఫైజర్‌

రష్యాలో పెట్టుబడులు నిలిపివేస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్‌ వెల్లడించింది......

Updated : 10 Aug 2022 11:35 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్‌ కీలక ప్రకటన చేసింది. ఆ దేశంలో కొత్తగా క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించబోమని, కొనసాగుతున్న అధ్యయనాల కోసం రోగులను నియమించుకోవడం మానుకుంటామని స్పష్టం చేసింది. రష్యాలో పెట్టుబడులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కానీ మానవాతా దృక్పథంతో వ్యవహరిస్తామని పేర్కొంటూ.. ఆ దేశానికి ఔషధాల సరఫరా కొనసాగిస్తామని వెల్లడించింది. దీంతో పాటు అక్కడి యూనిట్ నుంచి వచ్చే లాభాలన్నింటినీ ఉక్రెయిన్ ప్రజల సాయం కోసం విరాళంగా ఇస్తామని తెలిపింది. అక్కడ కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్‌ను ఆ దేశం వెలుపల నిర్వహించేందుకు యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఇతర రెగ్యులేటర్‌ సంస్థలతో కలిసి పని చేస్తామని ఫైజర్ తెలిపింది.

ఉక్రెయిన్‌పై పోరు నేపథ్యంలో అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై 2,700లకు పైగా ఆంక్షలు విధించాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో నిలిచింది. పుతిన్‌ సర్కారుపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తున్న అమెరికా శుక్రవారం మళ్లీ కొరడా ఝళిపించింది. రష్యా వాణిజ్య స్థాయిను తగ్గించాలని నిర్ణయించింది. ఆ దేశానికి వాణిజ్యపరంగా ఇస్తున్న మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (ఎంఎఫ్‌ఎన్‌) హోదాను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు రష్యా సముద్ర ఉత్పత్తులు, మద్యం, వజ్రాలపై నిషేధం విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని