Nepal: ఆ విమానాశ్రయం ప్రారంభించిన 15 రోజుల్లోనే పెను ప్రమాదం..!

నేపాల్‌(Nepal)లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకొన్న ఎయిర్‌పోర్టును 15 రోజుల క్రితమే ప్రారంభించారు. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  

Published : 16 Jan 2023 10:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం(Nepal Flight Crash) జరిగిన పొఖారా(Pokhara) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేవలం 15 రోజుల ముందే ప్రారంభించారు. 2023 జనవరి 1వ తేదీన దేశ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌  ప్రారంభించారు. బెల్ట్‌ రోడ్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ విమానాశ్రయాన్ని 215 మిలియన్‌ డాలర్ల రుణం తీసుకొని చైనా సాయంతో నిర్మించారు. కార్యకలాపాలు మొదలుపెట్టిన పక్షం రోజుల్లోనే నేపాల్‌ గత దశాబ్ద కాలంలోనే చూడనంత అతిపెద్ద విమాన ప్రమాదం చోటు చేసుకొంది.

ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..

నేపాల్‌లోని యతి ఎయిర్‌లైన్స్‌ విమానం ల్యాండింగ్‌ చివరి క్షణాల్లో పొఖారా విమానాశ్రయ రన్‌వే సమీపంలో కూలిపోయిందని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది వెల్లడించారు. ఈ విమానాశ్రయంలో తూర్పు, పడమర వైపుల రెండు రన్‌వేలు ఉన్నాయి. కాఠ్‌మాండూ(Kathmandu)లోని త్రిభువన్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 10.33కు విమానం గాల్లోకి ఎగిరింది. పొఖారా సమీపించగానే ఏటీఆర్‌-72 పైలట్‌ తూర్పు రన్‌వేపై ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతి తీసుకొన్నాడు. కానీ, తర్వాత పైలట్‌ నిర్ణయం మార్చుకొని పడమర రన్‌వేపై దిగాలని భావించాడు. ఏటీసీ సిబ్బంది దీనికి అనుమతి మంజూరు చేశారు. దీంతో విమానం ల్యాండింగ్‌కు యత్నిస్తుండగా ప్రమాదానికి గురైంది. పైలట్‌ చివరి నిమిషంలో రన్‌వే మార్చుకోవడానికి సాంకేతిక సమస్యే కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

ల్యాండింగ్‌కు పది క్షణాల ముందు..

ల్యాండింగ్‌ కావడానికి కేవలం కొన్ని సెకన్ల ముందు మాత్రమే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి మొత్తం 72 మంది ప్రాణాలను బలిగొందని అనుమానిస్తున్నారు. వాతావరణ సమస్యల కారణంగా కూలిందనే ప్రచారాన్ని నేపాల్‌ వైమానిక శాఖ కొట్టిపారేసింది. వాతావరణం అనుకూలంగానే ఉందని పేర్కొంది. విమానం కూలడానికి ముందు మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. బ్లాక్‌ బాక్స్‌ను విశ్లేషించాక పూర్తి కారణాలు తెలుస్తాయని చెప్పింది.

ఏటీఆర్‌-72 విమానం అత్యధికంగా గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దానిని భూమికి తక్కువ ఎత్తులో కూడా ఎగరగలిగేలా డిజైన్‌ చేశారు. ఇక యతి ఎయిర్‌లైన్స్‌ పాత విమానాలను ఎక్కువగా వాడుంతుందనే పేరుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని