Modi at G20: ‘నేటి ఎరువుల కొరతే.. రేపటి ఆహార సంక్షోభం!’

ఎరువులు, ఆహార ధాన్యాల సరఫరా వ్యవస్థలు స్థిరంగా కొనసాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లేనిపక్షంలో.. నేటి ఎరువుల కొరతే.. రేపటి ఆహార సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. జీ-20 సదస్సులో భాగంగా ‘ఆహార, ఇంధన భద్రత’ అంశంపై ప్రధాని మోదీ మంగళవారం ప్రసంగించారు.

Published : 15 Nov 2022 16:19 IST

బాలి: ఎరువులు, ఆహార ధాన్యాల సరఫరా వ్యవస్థలు స్థిరంగా కొనసాగాలని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పేర్కొన్నారు. లేనిపక్షంలో.. నేటి ఎరువుల కొరతే.. రేపటి ఆహార సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. జీ-20 సదస్సు(G20 Summit)లో భాగంగా ‘ఆహార, ఇంధన భద్రత’ అంశంపై ప్రధాని మోదీ మంగళవారం ప్రసంగించారు. కరోనా సమయంలో ఇతర దేశాలకు ధాన్యాల ఎగుమతులు చేపడుతూనే.. భారతీయులందరికీ ఆహార భద్రత(Food Security)ను కల్పించామంటూ ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోన్న నేపథ్యంలో.. ప్రధాని వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

‘ఆహార భద్రతను కల్పించే విషయంలో ఎరువుల కొరత కూడా పెద్ద సమస్యే. నేటి ఎరువుల కొరతే.. రేపటి ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో.. ఎరువులు, ధాన్యాల సరఫరా వ్యవస్థ స్థిరంగా కొనసాగేలా.. మనమంతా పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. భారత్‌లోనూ సుస్థిర ఆహార భద్రత కోసం.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. మినుములు వంటి పోషక, సంప్రదాయ ఆహార ధాన్యాలను తిరిగి ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు, పోషకాహార లోపాలను తృణధాన్యాలు పరిష్కరించగలవని ప్రధాని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరాన్ని ఉత్సాహంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా.. ప్రపంచ వృద్ధికి భారత్‌లో ఇంధన భద్రత కూడా ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. ‘ఇంధన సరఫరాలపై ఎటువంటి ఆంక్షలను ప్రోత్సహించకూడదు. ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని నెలకొల్పాలి. పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ పరిరక్షణకు భారత్‌ కట్టుబడి ఉంది’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని