PM Modi: షింజో అబె తుది వీడ్కోలుకు హాజరైన ప్రధాని మోదీ

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇప్పటికే అబె కుటుంబం ప్రైవేటుగా అంత్యక్రియలను పూర్తి చేసింది

Updated : 27 Sep 2022 13:48 IST

ఇంటర్నెట్‌డెస్క్: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇప్పటికే అబె కుటుంబం ప్రైవేటుగా అంత్యక్రియలను పూర్తి చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం నేడు అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. షింజో చితాభస్మాన్ని టోక్యో హాల్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వేలమంది ఆయనకు తుది నివాళిని అర్పించారు. 19 తుపాకుల అభివాదాన్ని సమర్పించారు. జపాన్‌లో అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు అందుకొన్న రెండో నేతగా అబె నిలిచారు. 

భారత ప్రధాని మోదీ అంతకు ముందు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదతో భేటీ అయ్యారు. అబె మరణానికి మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. అనంతరం భారత్‌-జపాన్‌ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.

షింజో తన తొమ్మిదేళ్ల పదవీ కాలంలో నాలుగుసార్లు భారత్‌ను సందర్శించడం ఓ రికార్డు. 2014 జనవరిలో భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తొలి జపాన్‌ ప్రధానిగా ఘనత సాధించారు. యూపీఏ అనంతరం అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంతో బలమైన సంబంధాలు నెరిపారు. భారత్‌-జపాన్‌ సంబంధాల్లో మోదీ-అబె శకం ఓ కీలక అధ్యాయం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని