PM Modi: సాంకేతికతలపై గుత్తాధిపత్యం వద్దు

సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Published : 15 Jun 2024 06:11 IST

అందరికీ అందుబాటులోకి రావాలి
జీ7 అనుబంధ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన

ఇటలీలోని బోర్గో ఇగ్నాజియాలో పోప్‌ ఫ్రాన్సిస్, ప్రధాని మోదీల ఆప్యాయ పలకరింపు.
చిత్రంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ

బారీ (ఇటలీ): సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని.. అప్పుడే సమ్మిళిత సమాజానికి పునాదులు పడటంతోపాటు అసమానతల నిర్మూలన సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. జీ7 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా శుక్రవారం ఇటలీలో అపులియా ప్రాంతంలోని బోర్గో ఇగ్నాజియా రిసార్టులో నిర్వహించిన కీలక సమావేశంలో మోదీ ప్రసంగించారు. కృత్రిమ మేధ (ఏఐ)ను పారదర్శకంగా, సుభద్రంగా మార్చడంతోపాటు అందరికీ అందుబాటులో తెచ్చేలా అన్ని దేశాలతో కలిసి భారత్‌ పనిచేస్తుందని హామీ ఇచ్చారు. 

ఆఫ్రికా దేశాల అభివృద్ధికి కృషి 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ఉద్రిక్తతల తాలూకు ఒత్తిడి గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు సవాలుగా మారిందని మోదీ అన్నారు. గ్లోబల్‌ సౌత్‌ ఆందోళలు, ప్రాధాన్యాల గురించి అంతర్జాతీయ వేదికపై గళమెత్తడాన్ని భారత్‌ తన బాధ్యతగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆఫ్రికాకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఆఫ్రికా దేశాల అభివృద్ధి, సుస్థిరత, భద్రత కోసం తాము కృషి చేస్తున్నామని.. భవిష్యత్తులోనూ దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కృత్రిమ మేధపై త్వరితగతిన జాతీయ వ్యూహాన్ని రూపొందించుకున్న అతికొన్ని దేశాల్లో భారత్‌ ఒకటని మోదీ పేర్కొన్నారు.


జీ7 సదస్సులో బైడెన్‌తో మోదీ మాటామంతీ

మొక్కలు నాటడం మహోద్యమంగా మారాలి 

పర్యావరణ పరిరక్షణ కోసం భారత్‌ ప్రారంభించిన ‘మిషన్‌ లైఫ్‌’ గురించి మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ‘అమ్మ కోసం ఒక మొక్క’ అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాను ప్రారంభించిన సంగతిని గుర్తుచేశారు. అందులో పాలుపంచుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. మొక్కలు నాటడాన్ని మహోద్యమంగా మార్చాలని, ప్రతిఒక్కరూ దాన్ని తమ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. మరోవైపు- భారత్‌ జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పన, కృత్రిమ మేధకు సంబంధించి ప్రారంభించిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మోదీపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తాజా సమావేశంలో ప్రశంసల వర్షం కురిపించారు. ఖనిజాల రంగంలో కీలక భాగస్వామ్య దేశాలుగా బ్రెజిల్, అర్జెంటీనా, భారత్‌లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభివర్ణించారు. 


ఏఐతో పొంచి ఉన్న ముప్పులపై పోప్‌ ఆందోళన 

కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి, వినియోగంలో మానవ గౌరవ మర్యాదల పరిరక్షణకు పెద్దపీట వేయాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. లేనిపక్షంలో అలాంటి శక్తిమంతమైన సాంకేతికతలు మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేసే ముప్పుందని హెచ్చరించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు జీ7 సదస్సుకు విచ్చేసిన పోప్‌.. ఈ మేరకు ఏఐ ప్రయోజనాలు, దానితో పొంచి ఉన్న ప్రమాదాలపై కీలక ప్రసంగం చేశారు. జీ7 సదస్సుకు హాజరైన తొలి పోప్‌గా ఫ్రాన్సిస్‌ నిలిచారు. 

పోప్‌ను భారత్‌కు ఆహ్వానించిన మోదీ: జీ7 సదస్సులో భారత ప్రధాని మోదీ, పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. భారత్‌ను సందర్శించాలంటూ పోప్‌ను మోదీ ఆహ్వానించారు. 


సార్వత్రిక సమరం విశేషాలను వివరించి.. 

భారత సార్వత్రిక ఎన్నికల పర్వం గురించి మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఎన్నికల్లో చరిత్రాత్మక గెలుపు రూపంలో ప్రజలు తమను ఆశీర్వదించడాన్ని ‘ప్రజాస్వామ్య విజయం’గా అభివర్ణించారు. ‘‘2,600కుపైగా రాజకీయ పార్టీలు, 10 లక్షల కన్నా ఎక్కువ పోలింగ్‌ బూత్‌లు, 50 లక్షలకుపైగా ఈవీఎంలు, 1.5 కోట్ల కన్నా అధిక పోలింగ్‌ సిబ్బంది, మొత్తం ఓటర్లు దాదాపు 97 కోట్ల మంది, ఓటు వేసింది 64 కోట్ల మంది. ఇంతటి భారీ ప్రక్రియను భారత్‌ పారదర్శకంగా పూర్తిచేసింది. ఫలితాలను  కొన్ని గంటల్లోనే ప్రకటించింది’’ అంటూ లోక్‌సభా సమరం విశేషాలను మోదీ వివరించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని