G20: మోదీ, జిన్‌పింగ్‌లు పలకరించుకున్న వేళ..!

దాదాపు రెండేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌(Xi Jinping)లు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇండోనేషియాలో జరుగుతోన్న జీ-20(G20 Summit) సదస్సులో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం దీనికి వేదికైంది.

Published : 15 Nov 2022 21:59 IST

బాలి: దాదాపు రెండేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌(Xi Jinping)లు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇండోనేషియాలో జరుగుతోన్న జీ-20(G20 Summit) సదస్సులో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా ఒకరికొకరు ఎదురుపడిన నేతలు.. పరస్పరం చేతులు కలిపి, ముచ్చటించారు. జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ సంభాషిస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. వాస్తవానికి.. జీ-20 సదస్సు క్రమంలో ఈ ఇద్దరు నేతల మధ్య భేటీ జరిగే అవకాశంపై వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఏ సమావేశం ఖరారు కాలేదని తెలుస్తోంది.

2020 తర్వాత ఇరువురు ముఖాముఖి మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. అదే ఏడాదిలో భారత్‌- చైనాల మధ్య గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా.. ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడినప్పటికీ పలకరించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తోపాటు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ తదితరులతో భేటీ అయ్యారు. భారత్‌కు చెందిన ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్‌, డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అథానోమ్‌, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ తదితరులను కలిశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని