మోదీకి ఫిజీ అత్యున్నత పురస్కారం.. గినియాలో అరుదైన గౌరవం

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(Modi) పసిఫిక్ దేశాల నుంచి అరుదైన గౌరవాన్ని పొందారు. ఫిజీ, పపువా న్యూ గినియా తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి.

Published : 22 May 2023 12:40 IST

పోర్ట్‌ మోరెస్బీ: పసిఫిక్ దేశమైన పపువా న్యూ గినియా(Papua New Guinea) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(Modi)కి అపూర్వ ఆదరణ లభించింది.  పపువా న్యూ గినియా, ఫిజీ నుంచి అత్యున్నత పురస్కారాలను పొందారు. ఫిజీ(Fiji) తన దేశ అత్యున్నత పౌర పురస్కారం(Fiji's Highest Civilian Honour) ‘ది కంపానియన్ ఆఫ్ ఆర్డర్‌ ఆఫ్ ఫిజీ’ని ఇచ్చి సత్కరించింది. ఆయన గ్లోబల్ లీడర్‌షిప్‌కు గుర్తుగా దీనిని అందజేసింది. ఆ తర్వాత గినియా నుంచి అరుదైన గౌరవాన్ని పొందారు.

పపువా న్యూ గినియా(Papua New Guinea)లో పర్యటించిన మోదీ.. సోమవారం ఇండియా-పసిఫిక్‌ ఐలాండ్స్‌ కోఆపరేషన్(FIPIC) మూడవ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిజీ ప్రధాని సిటివేని రెబుకా.. మోదీకి పౌర పురస్కారాన్ని అందించారు. ఇప్పటివరకు ఫిజీయేతరులైన అతికొద్ది మందికి మాత్రమే దీనిని అందుకొన్నారు. అనంతరం గినియా ప్రభుత్వం.. ‘కంపానియన్‌ ఆఫ్ ఆర్డర్‌ ఆఫ్‌ లొగొహు’ను ఇచ్చి గౌరవించింది.

గతంలో పలుదేశాలు మోదీకి అత్యున్నత పురస్కారాలను అందించాయి. అంతర్జాతీయ వేదికపై మోదీ నాయకత్వంతో భారత్‌కు పెరుగుతోన్న ప్రాబల్యం, ఇతర దేశాలతో మెరుగవుతున్న సంబంధాలకు గుర్తుగా ఈ గౌరవాలు దక్కుతున్నాయి.

మరోసారి ఆ బ్లూ జాకెట్‌ ధరించిన మోదీ..

వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలపై చూపిస్తోన్న పెను ప్రభావం విషయంలో అందరినీ చైతన్యం చేసేందుకు ప్రధాని మోదీ ముందుంటారు. దానిలో భాగంగా ఆయన పర్యావరణ హితమైన నీలం రంగు జాకెట్‌లో కన్పించారు. గినియాలో తొలిసారి పర్యటించిన ఆయన రోజు మొత్తం ఈ వస్త్రధారణలోనే ఉన్నారు. ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైకిల్‌ చేసి దానిని తయారు చేశారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ బహూకరించిన ఈ జాకెట్‌ను ధరించి ఇంతకుముందు మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని