Modi In Austria: ప్రపంచానికి భారత్‌ బౌద్ధాన్నిచ్చింది.. యుద్ధాన్ని కాదు: మోదీ

Modi In Austria: ఆస్ట్రియాలో మోదీ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రష్యా, ఆస్ట్రియా పర్యటనను ముగించుకొని భారత్‌కు బయలుదేరారు.

Published : 11 Jul 2024 08:08 IST

Modi In Austria | వియన్నా: ప్రపంచానికి భారత్‌ బౌద్ధాన్ని ఇచ్చిందని.. యుద్ధాన్ని కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్‌ ఎప్పుడూ సర్వమానవాళి శాంతి, సామరస్యాలే కోరుకుందని తెలిపారు. 21వ శతాబ్దంలో ఆ బాధ్యతను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ఆయన (PM Modi) అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రపంచ దేశాలు భారత్‌వైపు ఆసక్తిగా చూస్తున్నాయని మోదీ (Narendra Modi) అన్నారు. భారత్‌ చేసే ఆలోచనలు, పనులను నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. వేల సంవత్సరాలుగా భారత్‌ తమ నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోందని గుర్తుచేశారు. తద్వారా యుద్ధానికి బదులు.. శాంతి, సామరస్యాన్ని ప్రచారం చేస్తోందని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను ‘విశ్వబంధు’గా చూస్తోందని.. అది మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా భారత్‌పై తన భవిష్యత్‌ ప్రణాళికలను మోదీ (Modi) ప్రకటించారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తర్వాత వెయ్యేళ్ల పాటు అభివృద్ధి చెందిన, బలమైన దేశంగా కొనసాగేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు.

మోదీ పర్యటన గేమ్‌ ఛేంజర్‌: రష్యా

భారత్‌ తరహాలోనే ఆస్ట్రియా చరిత్ర, సంస్కృతి చాలా పురాతమైనది, గొప్పదని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య బంధాలూ చరిత్రాత్మకమైనవని గుర్తుచేశారు. దీని వల్ల ఉభయ దేశాలూ లబ్ధి పొందాయన్నారు. సంస్కృతి, వాణిజ్యం.. అన్ని రంగాల్లో సహకారం కొనసాగుతోందన్నారు. మోదీ ప్రసంగిస్తున్నంతసేపూ అక్కడి ప్రవాసులు ‘భారత్‌ మాతా కీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో సభను హోరెత్తించారు.

అనంతరం రష్యా, ఆస్ట్రియా పర్యటనను ముగించుకున్న మోదీ భారత్‌కు బయలుదేరారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌ కార్ల్‌ నెహమ్మర్‌, అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాండర్‌ బెల్లెన్‌తో ప్రధాని ఫలవంతమైన చర్చలు జరిపారు. వివిధ అంశాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పరస్పరం నిర్ణయించారు. రష్యాలోనూ అక్కడి భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని