PM Modi: ద్వైపాక్షిక భేటీలతో మోదీ బిజీబిజీ

జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వరుస ద్వైపాక్షిక భేటీలతో తీరిక లేకుండా గడిపారు.

Updated : 15 Jun 2024 06:17 IST

బైడెన్, మెలోనీ, సునాక్, మెక్రాన్‌లతో విడివిడిగా సమావేశాలు
కిషిద, జస్టిన్‌ ట్రూడోలతోనూ..

జీ7 సదస్సు వేదిక వద్ద సునాక్‌తో మోదీ ఆప్యాయ ఆలింగనం

బారీ: జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వరుస ద్వైపాక్షిక భేటీలతో తీరిక లేకుండా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్‌ సహా పలు దేశాల అధినేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. వరుసగా మూడో దఫా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోదీకి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. 

బ్రిటన్‌తో ఎఫ్‌టీఏ సంప్రదింపుల్లో పురోగతిపై సమీక్ష 

ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, బ్రిటన్‌ తాజాగా నిర్ణయించుకున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం     (ఎఫ్‌టీఏ) కోసం ఇరు దేశాల మధ్య జరుగుతున్న సంప్రదింపుల్లో పురోగతిపై మోదీ, సునాక్‌ సమీక్ష నిర్వహించారు. సంబంధిత చర్చల వేగంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠంగా మార్చుకోవాలన్న తమ ఆకాంక్షను పునరుద్ఘాటించారు. సెమీకండక్టర్లు, సాంకేతికత, వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 

జీ7 సదస్సుకు విచ్చేసిన భారత ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ

ఫ్రాన్స్‌తో రక్షణ సహకారం పెంపునకు అంగీకారం 

‘భారత్‌లో తయారీ’కి ప్రాధాన్యమిస్తూ రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని ఇంకా పెంచుకోవాలని భారత్, ఫ్రాన్స్‌ తాజాగా నిర్ణయించాయి. నవకల్పనలు, పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించాలనీ తీర్మానించుకున్నాయి. గత ఏడాది కాలంలో మోదీ, మెక్రాన్‌ భేటీ అవడం ఇది నాలుగోసారి. ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరు సమీక్ష నిర్వహించారు. రక్షణ, అణు, అంతరిక్షం, విద్య, కృత్రిమ మేధ సహా పలు రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ‘హారిజాన్‌-2047’, ఇండియా-పసిఫిక్‌ రోడ్‌మ్యాప్‌ల అమలును సమీక్షించారు. వచ్చే నెలలో పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో మెక్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. 

అమెరికా అధ్యక్షుడితో.. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ సమావేశమయ్యారు. ‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను కలవడం ఎప్పుడూ సంతోషాన్నిచ్చేదే. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా నిరంతరం కలిసి పనిచేస్తూనే ఉంటాయి’’ అని బైడెన్‌తో తన భేటీ గురించి మోదీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. తమ సమావేశపు ఫొటోలను అందులో పంచుకున్నారు. ఉభయ ప్రయోజనకర, ప్రాంతీయ అంశాలపై జపాన్‌ ప్రధాని కిషిదతో భేటీలో మోదీ చర్చించారు. ఇటలీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశంలో భారత ప్రధాని సమాలోచనలు జరిపారు. 


ఆ కలకలం తర్వాత ట్రూడోతో తొలిసారి..

మోదీ, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోల భేటీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓ ఖలిస్థానీ వేర్పాటువాది హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో నిరుడు ఆరోపించడం కలకలం సృష్టించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలకు బీటలు వారేలా చేసింది. అప్పటి నుంచి మోదీ, ట్రూడో నేరుగా భేటీ అవడం ఇదే తొలిసారి. తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యన్, జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-2, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌లతోనూ మోదీ జీ7 సదస్సు వేళ విడివిడిగా సమావేశమయ్యారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని