PM Modi: యుద్ధానికిది సమయం కాదు

ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్య సమితి చార్టర్‌కు కట్టుబడి జరిగే ఏ శాంతి ప్రయత్నానికైనా మద్దతిస్తాం.

Published : 11 Jul 2024 04:23 IST

ప్రధాని మోదీ స్పష్టీకరణ
ఆస్ట్రియా ఛాన్సలర్, అధ్యక్షుడితో భేటీ

ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్య సమితి చార్టర్‌కు కట్టుబడి జరిగే ఏ శాంతి ప్రయత్నానికైనా మద్దతిస్తాం. తూర్పు ఐరోపా ప్రాంతంలో శాంతికి అన్ని భాగస్వామ్య దేశాలు కలిసి రావాల్సిన అవసరముంది. ఇండో పసిఫిక్‌లో స్వేచ్ఛాయుత వాతావరణానికి సంబంధించి అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ సముద్ర జలాల్లో ప్రాంతీయ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం (దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం నేపథ్యంలో). సీమాంతర, సైబర్‌ ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తాం. ఏ దేశమూ ఉగ్రవాద ముఠాలకు కేంద్ర స్థానంగా ఉండకూడదన్నదే మా విధానం (పాకిస్థాన్‌ను ఉద్దేశించి). ఐరాస భద్రతా మండలి ఉగ్ర సంస్థలుగా పేర్కొన్న వాటిపై చర్యలకు వెనుకాడం. ఎఫ్‌ఏటీఎఫ్, ఎన్‌ఎంఎఫ్‌టీతోపాటు ఇతర వేదికలపైనుంచి ఉగ్రవాదాన్ని దునుమాడుతూనే ఉంటాం. 

- భారత్, ఆస్ట్రియా సంయుక్త ప్రకటన

వియన్నా: యుద్ధానికిది సమయం కాదని ప్రధాని  మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అంగీకార యోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌తో పలు అంశాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి గల అవకాశాలను పరిశీలించారు. రానున్న దశాబ్దంలో పరస్పరం సహకరించుకోవడానికి బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు. భేటీ అనంతరం రెండు దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మీడియాతో మాట్లాడారు. దాదాపు 40ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే ప్రథమం. మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్న మోదీకి  లఖ్‌నవూకు చెందిన విజయ్‌ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో వందేమాతరం గీతంతో ఘన స్వాగతం లభించింది. బుధవారం భేటీ సందర్భంగా మోదీ, నెహమ్మర్‌ ఆలింగనం చేసుకున్నారు. మోదీతో నెహమ్మర్‌ సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య అధికారిక చర్చలు జరిగాయి. ‘ఆస్ట్రియా ఛాన్సలర్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. ప్రపంచంలోని ప్రస్తుత ఘర్షణలపై మేమిద్దరం చర్చించాం. పశ్చిమాసియాలో ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మా మధ్య చర్చకు వచ్చాయి. యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కాబోవని తెలిపాను’ అని ప్రధాని మోదీ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

శాంతికి ప్రయత్నిస్తాం

చర్చలు, దౌత్యం ద్వారా సత్వర శాంతి స్థాపనకు భారత్, ఆస్ట్రియా ప్రయత్నిస్తాయని మోదీ తెలిపారు. ఈ లక్ష్య సాధనకు గల అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భారత్, ఆస్ట్రియా బంధానికి 75ఏళ్లయిన సందర్భంగా తాను రావడం గొప్ప విషయమని ప్రధాని వ్యాఖ్యానించారు. దాదాపు 40ఏళ్ల తర్వాత ప్రధాని ఈ దేశానికి వచ్చారని చెప్పారు.  

భారత్‌కు ఆ సత్తా ఉంది

భారత్‌ ప్రభావశీలమైన, అత్యంత విలువైన దేశమని, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి స్థాపనలో కీలక భాగస్వామి అని ఆస్ట్రియా ఛాన్సలర్‌ నెహమ్మర్‌ పేర్కొన్నారు. ‘రష్యా దూకుడుపై మేం వివరంగా చర్చించాం. ఐరోపా ఆందోళనలపై భారత్‌కు ఉన్న అవగాహన, అంచనాలను తెలుసుకునేందుకు నేను ప్రయత్నించా. దీనికంటే ముఖ్యంగా పశ్చిమాసియాలోని ఘర్షణలపై మాట్లాడుకున్నాం’ అని నెహమ్మర్‌ వివరించారు.   

పలు రంగాల్లో సహకారం

పలు రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించామని ప్రధాని మోదీ తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, ఆవిష్కరణ, సంప్రదాయేతర ఇంధనం, హైడ్రోజన్, జలం, వ్యర్థాల నిర్వహణ, కృత్రిమ మేధ, క్వాంటమ్‌ టెక్నాలజీ రంగాల్లో పరస్పరం సహకరించుకోనున్నామని చెప్పారు. వృత్తి నిపుణుల చట్టబద్ధ వలసలపై ఇప్పటికే ఒప్పందం కుదిరిందని తెలిపారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదంపై ఆలోచనలను పంచుకున్నామని వివరించారు. అంతర్జాతీయ సౌర, విపత్తుల నిర్వహణ వసతుల భాగస్వాముల, జీవ ఇంధన కూటమిలో చేరాలని ఆస్ట్రియాను కోరానని ప్రధాని చెప్పారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించామని, ఐక్యరాజ్య సమితిని సంస్కరించాల్సిన అవసరంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని వెల్లడించారు. 

  •  భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆస్ట్రియా కంపెనీలను ప్రధాని ఆహ్వానించారు. రెండు దేశాల్లోని కంపెనీల సీఈవోలను ఉద్దేశించి మోదీతోపాటు నెహమ్మర్‌ ప్రసంగించారు. 
  •  వియన్నాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రపంచానికి భారత్‌ బుద్ధుడిని ఇచ్చిందని, యుద్ధాన్ని కాదని తెలిపారు.

అధ్యక్షుడితో భేటీ

ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాండర్‌ బెల్లెన్‌తో బుధవారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై వారి మధ్య చర్చ జరిగింది. ఆస్ట్రియా పర్యటనకు వచ్చినందుకు మోదీకి బెల్లెన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంగా, ఆర్థిక శక్తిగా వాతావరణ మార్పులపై పోరాటంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని