PM Modi: రష్యాతో మరింత సుదృఢ బంధం

ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు మద్దతుగా నిలుస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

Updated : 09 Jul 2024 04:13 IST

ప్రధాని మోదీ ఉద్ఘాటన

దిల్లీ, మాస్కో: ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు మద్దతుగా నిలుస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రత్యేకమైన, గౌరవప్రదమైన భారత్, రష్యా వ్యూహాత్మక బంధం గత పదేళ్లలో మరింత ముందుకు సాగిందని తెలిపారు. ఇంధన, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకం వంటి రంగాలతోపాటు ప్రజల మధ్య సాంస్కృతిక బంధం విస్తృతమైందని పేర్కొన్నారు. సోమవారం రష్యా పర్యటనకు బయలుదేరేముందు, రష్యా చేరుకున్నాక ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘నా స్నేహితుడు పుతిన్‌తో అన్ని ద్వైపాక్షిక అంశాలపై సమీక్షించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆలోచనలను ఆయనతో పంచుకుంటా. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. భారత్, రష్యా బంధం ద్వారా రెండు దేశాల ప్రజలు ప్రయోజనం పొందుతారని చెప్పారు. రష్యాలో మోదీకి ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి మోదీ గౌరవార్థం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. 

కాల పరీక్షకు నిలిచిన బంధం

‘రానున్న 3 రోజుల్లో రష్యా, ఆస్ట్రియాల్లో పర్యటిస్తున్నా. ఈ రెండు దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ పర్యటన ఓ అద్భుత అవకాశంగా భావిస్తున్నా. భారత్‌కు ఈ దేశాలతో బంధం కాల పరీక్షకు నిలిచింది. ఆస్ట్రియాతో భారత్‌కు దృఢమైన, విశ్వసనీయమైన బంధం ఉంది. ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌డర్‌ బెల్లెన్, ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌తో భేటీ అవుతున్నా. వారితో ప్రజాస్వామ్యం, బహుళత్వ వాదంపై చర్చలు జరపబోతున్నా’ అని ప్రధాని మోదీ వివరించారు. ఆయన సోమవారం సాయంత్రం రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ఆయనకు ఉప ప్రధాని డెనిస్‌ మంత్రోవ్‌ స్వాగతం పలికారు. మరోవైపు రష్యాలో హిందూ ఆలయంతోపాటు పాఠశాలను నిర్మించాలని ప్రవాస భారతీయులు కోరుకుంటున్నారు.  

ఇద్దరు నేతల ఆలింగనం

నోవో ఓగర్యోవోలోని తన అధికారిక నివాసంలో ప్రధాని మోదీకి అధ్యక్షుడు పుతిన్‌ ప్రైవేటు విందు ఇచ్చారు. సోమవారం రాత్రి తన ఇంటికి వచ్చిన మోదీకి ఆయన ఘనంగా స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. ‘ఇద్దరు స్నేహితులు, విశ్వసనీయమైన భాగస్వాముల కలయిక అపూర్వం. మోదీని పుతిన్‌ ఘనంగా తన ఇంట్లోకి ఆహ్వానించారు’ అని భారత విదేశాంగశాఖ ఎక్స్‌లో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని