PM Modi: బ్రిటన్‌ నూతన ప్రధానికి మోదీ ఫోన్‌.. ‘ఎఫ్‌టీఏ’పై ఏమన్నారంటే..!

బ్రిటన్ నూతన ప్రధానిగా నియమితులైన కీర్‌ స్టార్మర్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని’ త్వరగా కొలిక్కి తెచ్చే దిశగా కృషి చేసేందుకు ఇరునేతలు అంగీకరించారు.

Published : 06 Jul 2024 17:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బ్రిటన్‌ నూతన ప్రధానిగా లేబర్‌ పార్టీ అధ్యక్షుడు కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer) ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో భారత్‌ పర్యటనకు రావాలంటూ ఆహ్వానించారు.

ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాలను గుర్తుచేసుకున్న నేతలు.. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిబద్ధతను చాటినట్లు భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరస్పర ప్రయోజనకరమైన ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ)’ వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చేందుకు కృషి చేయాలని అంగీకరించినట్లు వెల్లడించింది. బ్రిటన్‌ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల అభివృద్ధికి భారతీయ సమాజం అందించిన సహకారాన్ని అభినందిస్తూ.. ఇరుదేశాల ప్రజల నడుమ సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించడాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

బ్రిటన్‌ నూతన ఆశాకిరణం

లేబర్‌ పార్టీ 650 స్థానాలకు గాను 33.7 శాతం ఓట్లతో 412 సీట్లు దక్కించుకుంది. రిషి సునాక్‌ నేతృత్వంలోని అధికార కన్సర్వేటివ్‌ పార్టీ 23.7 శాతం ఓట్లు పొంది 121 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఈ క్రమంలోనే లేబర్‌ పార్టీ అధ్యక్షుడు కీర్‌ స్టార్మర్‌ దేశ 58వ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఫలితాలు వెల్లడైన వేళ ఆయనకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్‌-యూకే సంబంధాల బలోపేతం దిశగా నిర్మాణాత్మక సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని