Zelensky: అణు భయాలు నెలకొన్న వేళ.. జెలెన్‌స్కీకి మోదీ ఫోన్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌ ప్రతిష్టంభనకు సైనిక చర్య పరిష్కారం కాదని ఉద్ఘాటించిన మోదీ.. అణు కేంద్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 04 Oct 2022 21:20 IST

దిల్లీ: ఉక్రెయిన్‌(Ukraine)పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు యత్నిస్తోన్న రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌(Putin).. అణ్వాయుధాల ప్రయోగం జరపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky)కి ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌ ప్రతిష్టంభనకు సైనిక చర్య పరిష్కారం కాదని ఉద్ఘాటించిన ప్రధాని.. అణు కేంద్రాల(Nuclear facilities) భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వాటిలో ప్రమాదం.. విపత్కర పరిణామాలకు దారితీస్తుందని అన్నారు.

ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా శత్రుత్వాలను త్వరగా వీడాలని సూచించారు. చర్చలు, దౌత్య మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేశారు. శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. యూఎన్‌ ఛార్టర్‌, అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాల్సిన ప్రాధాన్యాన్ని కూడా చాటారు.

ఉక్రెయిన్‌తోసహా ప్రపంచంలోని అణు కేంద్రాల భద్రతకు భారత్‌ ఇస్తున్న ప్రాముఖ్యాన్ని మోదీ నొక్కిచెప్పారు. అణు కేంద్రాల ప్రమాదం.. ప్రజారోగ్యంతోపాటు పర్యావరణానికి విపత్కర పరిణామాలు కలిగిస్తుందని తెలిపారు. 2021 నవంబరులో గ్లాస్గోలో ఇరు నేతలు చివరిసారి సమావేశం అయినప్పుడు చర్చలోకి వచ్చిన ద్వైపాక్షిక అంశాలనూ ఈ సందర్భంగా ప్రస్తావించుకున్నట్లు పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని