PM Modi: ఐరాస ఉన్నది ఎందుకు..? జీ-7 వేదికపై మోదీ ప్రశ్న

శతాబ్దం కింద ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టడం లేదని.. అందుకే ఐరాసలో (United Nations) సంస్కరణలు అవసరమని ప్రధాని మోదీ (Narendra Modi) ఉద్ఘాటించారు.

Published : 21 May 2023 17:19 IST

హిరోషిమా: ప్రస్తుత ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించకుంటే ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ఐరాసలో భారీ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. జపాన్‌ హిరోషిమాలో జరిగిన జీ-7 సదస్సులో (G7 Summit) మాట్లాడిన మోదీ.. అంతర్జాతీయ స్థాయిలో శాంతి, స్థిరత్వానికి సంబంధించిన సవాళ్లపై చర్చించేందుకే ఐరాస (United Nations) ఏర్పడినప్పటికీ వివిధ వేదికలపై వీటిని ఎందుకు చర్చించాల్సి వస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘ఇది విశ్లేషణకు సంబంధించిన అంశం. శాంతి, స్థిరత్వానికి సంబంధించిన అంశాలను భిన్న వేదికలపై ఎందుకు చర్చించాలి? ఐరాస ఉన్నది ఎందుకు? శాంతి స్థాపన ఉద్దేశంతో ఏర్పడిన ఈ వేదిక ఘర్షణలను ఎందుకు విజయవంతంగా నిరోధించలేకపోతోంది? ‘కనీసం ఉగ్రవాదం అనే పదానికి నిర్వచనాన్ని కూడా ఐరాసలో ఆమోదించలేకపోతున్నారు. ఎందుకు..? ప్రతిఒక్కరు ఆత్మపరిశీలన చేసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వందేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న సంస్థలు 21వ శతాబ్దానికి అనుగుణంగా లేవనే విషయం తెలుస్తోంది. ప్రస్తుత వాస్తవికతకు అవి అద్దం పట్టడం లేదు. అందుకే ఐరాస వంటి సంస్థల్లో సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి సంస్థల్లో దక్షిణాది ప్రాంతాల (Global South) గళం కూడా ఉండాలి. లేదంటే, ఘర్షణలకు ముగింపు పలకాలని మాత్రమే మాట్లాడగలం.  దీంతో ఐరాసతోపాటు భద్రతా మండలి కూడా కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయి’ అని భారత ప్రధాని స్పష్టం చేశారు.

ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాలని భారత్‌ ఎప్పటినుంచో డిమాండు చేస్తోంది. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ వేదికల్లోనూ స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో రష్యా, బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌, అమెరికాలు మాత్రమే శాశ్వత దేశాలు. ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని కూడా తమ వీటో అధికారంతో అడ్డుకోగలవు. యూఎన్‌ఎస్‌సీలో 10 తాత్కాలిక దేశాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వాటి కాలపరిమితి కూడా కేవలం రెండేళ్లు మాత్రమే. భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, జర్మనీ, జపాన్‌ దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం ఎంతోకాలంగా పోరాటం చేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు