Pakistan: పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొడతా: పీఎం షెహబాజ్‌ షరీఫ్‌

పాక్‌(Pakistan)లో ఉగ్రవాదాన్ని అణచివేస్తానని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ఇమ్రాన్‌ నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. 

Published : 27 Dec 2022 15:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ (Pakistan) నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొడతామని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌(Shehbaz Sharif) ప్రకటించారు. పాక్‌(Pakistan)లో ఇటీవల ఉగ్రదాడులు పెరిగిపోయిన నేపథ్యంలో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌(Pakistan)లోని డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం పెరుగుతోందని.. అతి త్వరలోనే దానిని పూర్తిగా అణచివేస్తామని షెహబాజ్ (Shehbaz Sharif) పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా దళాలు కలిసి పనిచేసి దానిని నిర్మూలిస్తాయన్నారు. దేశంలో ఉగ్రవాదం పరిస్థితిపై షరీఫ్‌ త్వరలో నేషనల్‌ సెక్యూరిటీ కమిటీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. బన్ను దాడి ఘటనతో తన హృదయం బద్దలైందన్నారు. ఈ కాంపౌండులోకి చొరబడిన ఉగ్రవాదులను  భద్రతా దళాలు మట్టుబెట్టాయని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితిపై షరీఫ్‌ మాట్లాడుతూ ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని బయటపడేయాలని ఫెడరల్‌ ప్రభుత్వం కృత నిశ్చయింతో ఉందని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా సీపెక్‌లో భాగంగా నిర్మించిన 50 కిలోమీటర్ల రోడ్డును , చష్మా హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు వంటి వాటిని ప్రారంభించారు. 

ఇమ్రాన్‌ తీవ్ర విమర్శలు..

మరోవైపు షరీఫ్‌ ప్రభుత్వంపై పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పూర్తిగా నియంత్రించిందన్నారు. లాహోర్‌లోని జమాన్‌ పార్క్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తన హయాంలో దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా మార్చినట్లు ఇమ్రాన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ నాటి నుంచి పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదం 52శాతం పెరిగిందనిన్నారు. అక్కడ జరిగిన ఘటనల్లో 270 మంది చనిపోగా.. 550 మంది గాయపడినట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని