Modi: నమ్మిన వాళ్లే సాయం చేయలేదు: అభివృద్ధి చెందిన దేశాలపై ప్రధాని మోదీ ఆక్షేపణ

సోమవారం పపువా న్యూ గినియా (Papua New Guinea) ప్రధానితో పాటు పాల్గొన్న సదస్సులో అభివృద్ధి చెందిన దేశాల గురించి  ప్రధాని మోదీ మాట్లాడారు. వాటిపై తనకున్న అసంతృప్తిని బయటపెట్టారు.

Published : 22 May 2023 10:42 IST

పోర్ట్ మోరెస్బీ: అభివృద్ధి చెందిన దేశాలపై ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను నమ్మకం ఉంచిన దేశాలు అవసరకాలంలో అండగా నిలవలేదని వ్యాఖ్యానించారు. సోమవారం పపువా న్యూ గినియా(Papua New Guinea) పర్యటనలో ఉన్న ఆయన ఇండియా-పసిఫిక్‌ ఐలాండ్స్‌ కోఆపరేషన్(FIPIC) మూడవ సదస్సులో  మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. 

‘గ్లోబల్‌ సౌత్(పేద దేశాలు)పై కొవిడ్ ప్రభావం తీవ్రంగా పడింది. వాతావరణ మార్పులు, ఆకలి, పేదరికం, వైద్యపరమైన సమస్యలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఇంధనం, ఆహారం, ఎరువులు, ఔషధాల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఆ ప్రభావాన్ని మనమంతా అనుభవిస్తున్నాం. ఇంకా కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ క్లిష్టసమయంలో మేం నమ్మినవారు మాతో నిలబడలేదు. కానీ, భారత్ మాత్రం పసిఫిక్ ప్రాంత దేశాలకు అండగా నిలవడం పట్ల సంతోషంగా ఉన్నాను’అని మోదీ అన్నారు. ఎలాంటి సంకోచం లేకుండా పసిఫిక్ దేశాలతో తన అనుభవాలను, సామర్థ్యాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. తన దృష్టిలో పసిఫిక్‌ ద్వీప దేశాలు.. మహాసముద్రం పరిధిలోని పెద్ద దేశాలని, చిన్నద్వీపదేశాలు ఏమాత్రం కాదని వ్యాఖ్యానించారు. 

ఈ సదస్సులో గినియా ప్రధాని జేమ్స్ మరాపే(James Marape) మాట్లాడుతూ.. ప్రపంచ వేదికపై భారత్ నాయకత్వాన్ని కొనియాడారు. అలాగే మనదేశం అందిస్తోన్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘అగ్రదేశాలు అధికారం కోసం ఆడుతున్న ఆటలో తాము బాధితులమయ్యాం. మీరు గ్లోబల్‌ సౌత్‌కు నాయకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై మేం మీకు వెన్నంటి ఉంటాం’అని భారత్‌తో కలిసి నడవడం పట్ల ఆసక్తి చూపించారు. తమ మధ్య ఫలవంతమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయని ఇరుదేశాల నేతల వెల్లడించారు. అలాగే తమిళ ప్రఖ్యాత ‘తిరుక్కురల్‌’గ్రంథానికి గినియా స్థానిక భాషలో చేసిన అనువాదాన్ని ఈ ఇద్దరు నేతలు ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే.. అంతకుమందు పపువా న్యూ గినియాకు చేరుకున్న ప్రధానికి అపూర్వ స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. జేమ్స్‌ మరాపే.. మోదీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. పపువా న్యూ గినియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని