Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..?

పాకిస్థాన్ ‌(Pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) సహా మరో 150 మందిపై ఆ దేశంలోని పంజాబ్‌ (Punjab) రాష్ట్రంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.....

Updated : 01 May 2022 12:14 IST

లాహోర్‌: పాకిస్థాన్ ‌(Pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) సహా మరో 150 మందిపై ఆ దేశంలోని పంజాబ్‌ (Punjab) రాష్ట్రంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇటీవల సౌదీ అరేబియాకు వెళ్లిన ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ (Shehbaz Sharif) బృందంపై అక్కడ కొంతమంది అనుచిత నినాదాలు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వారిలో చాలా మంది ఇమ్రాన్ మద్దతుదారులు ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టినట్లు ప్రస్తావించారు.

ఇమ్రాన్‌ మద్దతుదారులు షెహబాజ్‌ను ఉద్దేశించి ‘దొంగ’, ‘దేశద్రోహి’ అని నినదించినట్లు వీడియోలో ఉందన్నది ప్రధాన ఆరోపణ. కొంత మంది ప్రధాని బృందంపై అసభ్యపదజాలం కూడా ఉపయోగించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. ఇమ్రాన్‌తో పాటు ఆయన కేబినెట్‌లో మంత్రులుగా చేసిన ఫవాద్‌ చౌదరి, షేక్‌ రషీద్‌, జాతీయ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం సూరీ సహా లండన్‌లోని ఇమ్రాన్‌ సన్నిహితులు అనిల్‌ ముసారత్‌, సాహిబ్‌జాదా జహంగీర్‌లను కూడా ఎఫ్‌ఐఆర్‌ఈలో చేర్చారు. సౌదీలో (Saudi Arabia)ని మదీనాలో ఈ ఘటన జరిగింది. దీంతో స్థానిక పోలీసులు నినాదాలు చేస్తున్న ఐదుగురు పాకిస్థానీలను అరెస్టు చేసినట్లు పంజాబ్‌ పోలీసులు తెలిపారు.

లాహోర్‌కి 180 కి.మీ దూరంలో ఉన్న ఫైసలాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనుచిత నినాదాలతో పవిత్ర మదీనా ప్రాంతాన్ని అపవిత్రం చేశారంటూ స్థానిక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 100 మంది మద్దతుదారులను ఇమ్రాన్ (Imran Khan) సౌదీకి పంపించి నినాదాలు చేయించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని