America: ‘మెంఫిస్‌’ ఘటన ఎఫెక్ట్‌.. పోలీసు ప్రత్యేక విభాగం రద్దు!

అమెరికాలో టైర్ నికోల్స్‌ ఘటనపై పెద్దఎత్తున నిరసనలు వస్తుండటంతో మెంఫిస్‌ నగర పోలీసు విభాగం స్పందించింది. అతనిపై దాడికి పాల్పడిన పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం ‘స్కార్పియన్‌’ను రద్దు చేసింది.

Published : 29 Jan 2023 23:28 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని మెంఫిస్‌ నగరంలో టైర్‌ నికోల్స్‌(Tyre Nichols) అనే యువకుడిపై పోలీసుల అమానుష దాడి ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితుడు మృతి చెందాడు. దీంతో ఈ దారుణాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. మెంఫిస్‌(Memphis) నగరం స్తంభించిపోయింది. ఈ పరిణామాల నడుమ మెంఫిస్ పోలీస్ విభాగం తాజాగా స్కార్పియన్‌ (స్ట్రీట్ క్రైమ్స్ ఆపరేషన్ టు రీస్టోర్ పీస్ ఇన్ అవర్ నైబర్‌హుడ్స్) అనే స్పెషల్ యూనిట్‌ను రద్దు చేసింది. నికోల్స్‌ ఘటనకు సంబంధించి స్కార్పియన్‌(Scorpion) విభాగానికే చెందిన ఐదుగురు పోలీసులపై సెకండ్‌ డిగ్రీ హత్యా నేరం కింద అభియోగాలు మోపారు.

‘కొంతమంది హేయమైన చర్యలు స్కార్పియన్‌కు చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా మెంఫిస్ పోలీసు విభాగం చర్యలు తీసుకోవడం అవసరం. ప్రజాహితం దృష్ట్యా ఈ యూనిట్‌ను శాశ్వతంగా రద్దు చేస్తున్నాం’ అని పోలీసు డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. నికోలస్ కుటుంబం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇదిలా ఉండగా.. కారు దొంగతనాలు, ముఠా సంబంధిత నేరాల వంటి ఘటనపై దృష్టి సారించేందుకు 2021 అక్టోబరులో స్కార్పియన్‌ యూనిట్‌ ప్రారంభమైంది. 50 మంది పోలీసులతో  కూడిన ఈ బృందం.. ప్రత్యేక ప్రాంతాల్లో నేరాలను తగ్గించేందుకు పని చేసింది. నికోల్స్‌ ఘటన నేపథ్యంలో తాజాగా రద్దయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని