Birth Rate: ఎక్కువ మంది పిల్లలను కనండి.. ఇటలీ వాసులకు పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపు!

ఇటలీలో జననాల రేటు కనిష్ఠానికి పడిపోయింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం.. జనాభా పెంపుదలపై చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పోప్ ఫ్రాన్సిస్ సైతం.. ఎక్కువమంది పిల్లలను కనాలంటూ శుక్రవారం ఇటాలియన్లకు పిలుపునిచ్చారు.

Published : 13 May 2023 01:45 IST

రోమ్‌: చైనా (China), జపాన్‌ (Japan) తదితర దేశాలు జనాభా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే. ఇటలీ (Italy)లో సైతం గతేడాది జననాల రేటు (Birth Rate) రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జనాభా పెంపుదలపై చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) సైతం.. ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ శుక్రవారం ఇటాలియన్లకు పిలుపునిచ్చారు. జనాభా పెరుగుదల మందగమనాన్ని తిప్పికొట్టేందుకు రాజకీయ చర్యలు అవసరమని తెలిపారు. పిల్లలకు బదులు పెంపుడు జంతువులను కలిగి ఉన్న జంటలను ఈ సందర్భంగా పోప్‌ విమర్శించారు. ఈ క్రమంలోనే తమ కుటుంబాలను వృద్ధి చేసుకునేందుకు వీలుగా జంటలకు తగిన వనరులను అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఇటలీలో గతేడాది రికార్డు స్థాయిలో కనిష్ఠంగా జననాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కేవలం 3.92 లక్షల మంది మాత్రమే జన్మించారు. మరణాల సంఖ్య మాత్రం 7.13 లక్షలుగా ఉంది. ఇటలీలో మహిళల సంతానోత్పత్తి రేటు సగటున 1.24గా ఉంది. చిన్నారులకు సరైన సంరక్షణ కేంద్రాలు లేకపోవడం, తక్కువ వేతనాలు, పని భారం తదితర అంశాలు సైతం జననాల రేటు తగ్గుదలకు కారణంగా అక్కడి అధ్యయనాల్లో తేలింది. ఈ పరిణామాలతో దేశ సామాజిక భద్రత, ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉందని జనాభా శాస్త్ర నిపుణులు హెచ్చరించారు. దీంతో ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం.. జననాలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటోంది. 2033 నాటికి ఏడాదికి కనీసం 5లక్షల జననాలు నమోదవ్వడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని