Ukraine Crisis: శ్మశానంలా మారుతున్న మేరియుపోల్‌

అందమైన ఈ తీర నగరంలో ఇప్పుడు శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. బాంబుల కుంభవృష్టిలో భవనాలన్నీ

Published : 23 Mar 2022 10:39 IST

ఆహారం, నీరు లేక అల్లాడుతోన్న లక్ష మంది 

ఇంటర్నెట్‌డెస్క్‌: అందమైన ఈ తీర నగరంలో ఇప్పుడు శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. బాంబుల కుంభవృష్టిలో భవనాలన్నీ మాడిమాసైపోయాయి. రష్యా దాడిలో అల్లకల్లోలంగా మారిన పోర్ట్‌ నగరం మేరియుపోల్‌లో ప్రస్తుత పరిస్థితులివి. ఈ నగరంలో ఉక్రెయిన్‌ బలగాలు లొంగిపోయేందుకు నిరాకరించడంతో రష్యా తమ దాడుల్ని తీవ్రతరం చేసింది. దీంతో నగరం శ్మశానంలా మారుతోందని ఉక్రెయిన్‌ అధికారులు చెబుతున్నారు. ఆహారం, నీరు లేక లక్ష మంది అల్లాడిపోతున్నట్లు తెలిపారు. 

అజోవ్‌ సముద్ర తీరంలో ఉండే మేరియుపోల్‌ నగరంలో రష్యా యుద్ధానికి ముందు 4,30,000 మంది నివాసముండేవారు. దాడుల మొదలైన తర్వాత కొందరు పొరుగు దేశాలకు వలస వెళ్లారు. మరికొందరిని అధికారులు సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఇంకా దాదాపు లక్ష మంది నగరంలోనే చిక్కుకుపోయారు. నిత్యం బాంబుల మోతతో బయటకు రాలేక వీరంతా ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత మూడు వారాలుగా మేరియుపోల్‌లో బాంబుల జడివాన కురుస్తోందని, దాదాపు ఏ భవనమూ అక్కడ మిగల్లేదని ఆ నగరం నుంచి బయటపడ్డ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు మేరియుపోల్‌లో చిక్కుకున్న ప్రజలకు సాయం చేసేందుకు వెళ్తోన్న సహాయక సిబ్బందిని రష్యా బలగాలు నిలిపివేశాయి. ఈ నగరానికి మందులు, ఆహారంతో వెళ్లిన కాన్వాయ్‌ను కూడా రష్యా బలగాలు అడ్డుకుని అందులోని సిబ్బందిని బందీలుగా చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. మేరియుపోల్‌లో చిక్కుకున్న పౌరుల పరిస్థితి దారుణంగా ఉందని, కనీసం ఆహరం, నీరు కూడా లేని పరిస్థితిలో అనేక మంది చిన్నారులు డీహైడ్రేషన్‌తో చనిపోతున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు. 

చెర్నోబిల్‌ ల్యాబ్‌ ధ్వంసం..

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా సేనలు ఇప్పటికే చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడి కొత్త లాబోరేటరీని రష్యా బలగాలు ధ్వంసం చేసినట్లు తెలిసింది. రేడియోయాక్టివ్‌ వ్యర్థాలను నిర్వహించేందుకు కొత్తగా నిర్మించిన ఈ ల్యాబ్‌ను రష్యా ధ్వంసం చేసింది. యూరోపియన్‌ కమిషన్‌ సహకారంతో 6 మిలియన్‌ యూరోలతో నిర్మించిన ఈ ల్యాబ్‌ను 2015లోనే ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని