COP27: పర్యావరణ పరిరక్షణపై చర్చలు.. వచ్చిందేమో ప్రైవేట్‌ జెట్స్‌లో..!

శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాతావరణ మార్పులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే వరదలు, గాడ్పులు, కరువు తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 11 Nov 2022 13:18 IST

షర్మ్‌ ఎల్‌ షేక్‌(ఈజిప్ట్‌): ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోన్న వాతావరణ సవాళ్లను అధిగమించే నిమిత్తం కాన్ఫరెన్స్‌ ఆఫ్ పార్టీస్‌-27 సదస్సు జరుగుతోంది. ఐరాస ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సులో 200 దేశాల నుంచి 35 వేల మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ కార్యకర్తలు, వాణిజ్యవేత్తలు,అనేకమంది దేశాధినేతలు పాల్గొంటున్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఇప్పటివరకూ చేసిన తీర్మానాలు.. వాటి అమలు తీరును వీరంతా సమీక్షించి.. కొత్త దిశదశను ప్రపంచానికి నిర్దేశిస్తారు. ఈ బృహత్తర బాధ్యతలు నెత్తిన పెట్టుకున్న పలువురు ప్రముఖులు వ్యక్తిగత విమానాల్లో(ప్రైవేట్‌ జెట్స్‌) సదస్సుకు రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ఈ సదస్సు నిర్వహిస్తోన్న నగరంలో సుమారు 400 ప్రైవేట్ జెట్స్ ల్యాండ్‌ అయ్యాయని ఈజిప్టు ఏవియేషన్ అథారిటీతో సన్నిహిత సంబంధాలున్న వర్గాలు ధ్రువీకరించాయి. ‘కాప్ 27కి ముందు ఒక సమావేశం జరిగింది. జెట్స్ రాకను అంచనా వేసిన అధికారులు షర్మ్‌ ఎల్‌ షేక్‌లో తగిన ఏర్పాటు చేశారు’ అని వెల్లడించాయి. ఈజిప్టు పాలకవర్గానికి సన్నిహితుడైన ఒక టాక్‌ షో హోస్ట్‌ మాట్లాడుతూ .. 300కు పైగా జెట్స్ వచ్చినట్లు వెల్లడించారు. కాప్‌ సదస్సు వేళ.. ఈ జెట్స్ వాడకంపై విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది గ్లాస్గోలో జరిగిన సమావేశాల సమయంలో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు కూడా వాటి సంఖ్య వందల్లోనే ఉంది. 

ఇదిలా ఉంటే.. కమర్షియల్ విమానాలతో పోలిస్తే, ఈ ప్రైవేట్‌ జెట్స్ వల్ల వెలువడే ఉద్గారాల మోతాదు చాలా అధికం. యూరోపియన్ క్లీన్‌ ట్రాన్స్‌పోర్టు కాంపెయిన్ గ్రూప్‌ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్‌ జెట్ ఒక గంటలో రెండు టన్నుల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. కమర్షియల్ విమానాలతో పోలిస్తే.. ఇలా వ్యక్తిగత విమానాల వల్ల  ఐదు నుంచి 14 రెట్లు అధిక కాలుష్యం విడుదల అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం.. లండన్‌ నుంచి షర్మ్‌ ఎల్‌ షేక్‌కు విమానంలో ప్రయాణిస్తే ఒక్కో ప్రయాణికుడికి లెక్కిస్తే..  సగటున హాఫ్ టన్ను CO2 విడుదలవుతుంది. 

శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాతావరణ మార్పులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే వరదలు, వడగాలులు, కరవు తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా ఐరాస చీఫ్ గట్టి హెచ్చరిక చేశారు. ‘మానవాళి ముందు రెండు మార్గాలున్నాయి. సహకరించుకోవడం లేక నశించడం’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని