EarthQuake: తుర్కియే, సిరియాలో భారీ భూకంపం.. 195 మంది మృతి

తుర్కియే (Turkey), సిరియాలో భారీ భూకంపం (Earthquake) సంభవించి పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. భూకంప తీవ్రతకు వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

Updated : 06 Feb 2023 16:30 IST

అంకారా: తుర్కియే (Turkey), సిరియా (Syria)లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం (EarthQuake) సంభవించి పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ విలయం కారణంగా రెండు దేశాల్లో ఇప్పటివరకు కనీసం 195 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో వెయ్యి మంది వరకు గాయపడ్డారు.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది.  భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్‌ (USA) జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. తుర్కియేలోని గాజియాన్‌తెప్‌ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన పావుగంట తర్వాత 6.7తీవ్రతతో మరోసారి శక్తిమంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు భూమి కంపించినట్లు తెలిపారు.

తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు తుర్కియేలో 76 మంది మృతిచెందగా.. మరో 440 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇక సిరియాలోని ప్రభుత్వ అధీన ప్రాంతాల్లో 99 మంది మృతిచెందగా.. రెబల్స్‌ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో 20 మరణాలు సంభవించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. టర్కీలో కనీసం 130 భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయినట్లు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు. తుర్కియేలోని మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో, దియర్‌బకీర్‌ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉంది. సిరాయాలో అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లు నేలమట్టమైన ఫొటోలు భూకంప తీవ్రతను తెలియజేస్తున్నాయి. తుర్కియేలోని దియర్‌బకీర్‌ ప్రాంతంలో ఓ భవనం పేకమేడలా కుప్పకూలిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక హతయ్‌ ప్రాంతంలో భూకంప తీవ్రతకు సహజవాయువు గ్యాస్‌ పైప్‌లైను పేలి భారీగా మంటలు చెలరేగాయి.

తుర్కియే (Turkey)లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2020 జనవరిలో ఇలాజిగ్‌ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అక్టోబరులో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంప విలయంలో 114 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 1999లో టర్కీ చరిత్రలో అత్యంత భీకర ప్రకృతి బీభత్సాన్ని చవిచూసింది. ఆ ఏడాది 7.4తీవ్రతతో భూకంపం సంభించి 17వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 1000 మంది మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని