EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్‌పోర్టు రన్‌వే

భూప్రళయంతో అతలాకుతలమైన తుర్కియే (Turkey), సిరియా (Syria) సరిహద్దుకు ఇరువైపులా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. భూకంపం ధాటికి అనేక ప్రాంతాల ఆనవాళ్లు మారిపోయి మరుభూమిని తలపిస్తున్నాయి.

Updated : 07 Feb 2023 10:28 IST

అంకారా: తుర్కియే (Turkey), సిరియా (Syria)ల్లో ఘోర ప్రకృతి విపత్తు పెను నష్టాన్ని మిగిల్చింది. ఆగ్నేయ తుర్కియే, ఉత్తర సిరియాల్లో సోమవారం వరుసగా సంభవించిన శక్తిమంతమైన భూకంపాలు (EarthQuakes).. వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి. భూకంప తీవ్రతకు అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. తుర్కియేలోని హతయ్‌ ప్రావిన్స్‌లో గల ఎయిర్‌పోర్టులో ఉన్న ఒకే ఒక్క రన్‌వే (Runway) ప్రకంపనల ధాటికి రెండు ముక్కలై పూర్తిగా పనికిరాకుండా పోయింది.

హతయ్‌ (Hatay) ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని రన్‌వే తీవ్రంగా ధ్వంసమైంది. భారీగా పగుళ్లు ఏర్పడి రన్‌వే రెండుగా చీలిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలను నిలిపివేశారు. భూకంప తీవ్రతకు ఒక్క తుర్కియేలోనే 5600లకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘోర విపత్తు కారణంగా రెండు దేశాల్లో ఇప్పటివరకు 4500 మందికిపై మృత్యువాత పడగా.. దాదాపు 20వేల మంది గాయపడ్డారు. అయితే శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది.

ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే..

రెండు దేశాల్లోనూ భూకంప (EarthQuake) ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. కొన్నిచోట్ల శిథిలాల అడుగు నుంచి ప్రజలు ఆర్తనాదాలు చేయడం వినిపించింది. ఈ విపత్తు నుంచి బయటపడిన వారు బండరాళ్ల కింద చిక్కుకున్న తమ వారి కోసం రోదించడం యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తుంది.

సహాయక సామగ్రిని పంపిన భారత్‌..

భూప్రళయంతో అతాలకుతలమైన తుర్కియే, సిరియాలకు ఆపన్నహస్తం అందించేందుకు భారత్‌ (India) సహా పలు దేశాలు ముందుకొచ్చాయి. మంగళవారం ఉదయం భారత్‌ నుంచి సహాయక సామగ్రితో కూడిన ఓ విమానం తుర్కియేకు బయల్దేరింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు, సహాయక బృందాలు, ఔషధాలు, డ్రిల్లింగ్‌ యంత్రాలు, ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్‌ స్క్వాడ్‌ను పంపించినట్లు భారత విదేశాంగ శాఖ (MEA) వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు