Earthquake: తుర్కియే, సిరియాలో భూకంప విలయం.. 2,600 దాటిన మృతులు
తుర్కియే (Turkey), సిరియా (Syria)లో ప్రకృతి విలయం సృష్టించింది. భారీ భూకంపం కారణంగా రెండు దేశాల్లో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడ్డారు.
అంకారా: ప్రకృతి ప్రకోపానికి తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం (Earthquake) పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 2,600ల మందికి పైగా మృత్యువాత పడగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరోవైపు, తుర్కియేలో దశలవారీగా భూ ప్రకంపనలతో జనం ప్రాణభయంతో భీతిల్లిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తుర్కియే (Turkey) కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ (USA) జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆగ్నేయ తుర్కియేలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం (Earthquake) తీవ్ర ప్రభావం చూపించింది. తుర్కియేలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భారీగా మరణాలు..
తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తుర్కియేలో మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించగా.. ఇప్పటివరకు 1600ల మందికి పైగా మరణించినట్లు అక్కడి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, 8500 మందికి పైగా గాయపడగా.. భూకంప తీవ్రతకు తుర్కియేలో దాదాపు 3వేల భవనాలు ధ్వంసమయ్యాయి.
ఇకపోతే, సిరియా (Syria)లోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాలు, రెబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కలిపి 1,000 మందికి పైగా మరణించినట్టు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గతంలో టర్కీలో భూకంప విషాదాలు ఇలా..
ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప జోన్లలో టర్కీ ఒకటి. 1999లో టర్కీలో సంభవించిన భూకంప తీవ్రత (7.4) పెను విషాదాన్ని సృష్టించింది. ఆ సమయంలో 17వేల మందికి పైగా మృతిచెందగా.. ఒక్క ఇస్తాంబుల్‌లోనే వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 1939లో తూర్పు ఎర్జిన్‌కన్ ప్రావిన్స్‌లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు కాగా.. ఆ సమయంలో 33వేల మంది మృతిచెందారు.
మోదీ దిగ్భ్రాంతి..
భూకంప విలయంపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని తెలిపారు. ఆ దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అటు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా విచారం వ్యక్తం చేశారు.
సాయానికి ముందుకొస్తున్న ప్రపంచ దేశాలు..
తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యానికి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్ సహా నెదర్లాండ్స్, గ్రీస్, సెర్బియా, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు సహాయక సామగ్రి, ఔషధాలు వంటివి పంపిస్తామని హామీ ఇచ్చాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Navy: భారత నేవీ మరో ఘనత.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో
-
Movies News
Virupaksha: ‘విరూపాక్ష’ మీమ్స్.. ఈ వైరల్ వీడియోలు చూస్తే నవ్వాగదు!
-
Ts-top-news News
Guntur: మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను
-
Movies News
Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్, ‘ఆదిపురుష్’ టీమ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TSLPRB: తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం