Joe Biden: 2024 ఎన్నికల్లో పోటీ చేస్తా.. జో బైడెన్‌ ప్రకటన

US President Elections: వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ పోటీ చేయనున్నారు. ఈ మేరకు నేడు ప్రచార వీడియోను విడుదల చేశారు.

Updated : 25 Apr 2023 18:18 IST

వాషింగ్టన్‌: అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన బైడెన్‌.. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రచారం మొదలుపెట్టారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని, దేశానికి సేవ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని అమెరికన్లకు ఆయన పిలుపునిచ్చారు. ఇక, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కూడా వచ్చే ఎన్నికల్లో వైస్‌ ప్రెసిడెంట్‌గా తిరిగి పోటీ చేయనున్నట్లు బైడెన్‌ వెల్లడించారు.

‘‘ప్రజాస్వామ్యం కోసం, తమ ప్రాథమిక స్వేచ్ఛ కోసం ప్రతి తరం వారు నిలబడాల్సిన క్షణం ఒకటి ఉంటుంది. ఇది మన సమయం అని నేను నమ్ముతున్నా. అందుకే అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ పడుతున్నా. మాకు మద్దతుగా నిలవండి’’ అని బైడెన్‌ (Joe Biden) ట్విటర్‌లో వీడియో షేర్‌ చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికలను రిపబ్లికన్ల అతివాదంపై పోరాటంగా ఆయన అభివర్ణించారు.

2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US President elections) జరగనున్నాయి. అంతకంటే ముందే అధ్యక్ష బరిలో నిలిచే తుది అభ్యర్థుల కోసం ఆయా పార్టీల్లో ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, అధ్యక్షుడే రెండోసారి పోటీకి దిగడంతో.. అధికార పార్టీలో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేనట్లే. మరోవైపు, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ తరఫున తాను పోటీచేయాలనుకొంటున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇప్పటికే ప్రకటించగా, అదే పార్టీకి చెందిన ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌ కూడా బరిలో దిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో బైడెన్‌ (Joe Biden) వయసు అంశం ప్రధానం కానుంది. ఒకవేళ బైడెన్‌ రెండోసారి విజయం సాధించి పదవీకాలం పూర్తి చేసేనాటికి దాదాపు 86 ఏళ్లకు చేరుకోనున్నారు. దీంతో వయసు రీత్యా ఆయనకు అమెరికన్లు మరో అవకాశం ఇస్తారా లేదా అనేది సందిగ్ధంగానే ఉంది. మరోవైపు, ఈ ఏడాది మొదట్లో ఆయన ‘రహస్య పత్రాల’ వివాదంలో ఇరుక్కున్నారు. ఈ అంశాలన్నీ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని