QUAD: బైడెన్‌కు ‘సీలింగ్‌‘ భయం.. క్వాడ్‌ దేశాధినేతల సదస్సు రద్దు

అమెరికా (US) ఖజానా మరికొన్ని రోజుల్లో నిండుకోనుంది. అప్పటి వరకు డెట్‌ సీలింగ్‌ పరిమితిని పెంచాల్సి ఉంటుంది. లేదంటే అమెరికా దివాలా తీయాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు బైడెన్‌ (Joe Biden) సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అగ్రరాజ్య అధ్యక్షుడు తన ఆస్ట్రేలియా పర్యటనను వాయిదా వేసుకున్నారు.

Published : 17 May 2023 12:13 IST

వాషింగ్టన్‌/కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా వేదికగా వచ్చేవారం జరగబోయే క్వాడ్‌ సదస్సు రద్దయ్యింది. అగ్రరాజ్యంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సిడ్నీ పర్యటనకు రావట్లేదు. దీంతో క్వాడ్‌ దేశాధినేతల సదస్సును రద్దు చేస్తున్నట్లు ఆసీస్‌ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ వెల్లడించారు.

అమెరికాను డెట్‌ సీలింగ్‌ (రుణ గరిష్ఠపరిమితి) సమస్య వెంటాడుతోంది. డెట్‌ సీలింగ్‌కు చట్టసభ ఆమోదం లభించకపోతే అగ్రరాజ్యం దివాలా తీసే ప్రమాదముంది. దీంతో ఈ అంశంపై జో బైడెన్‌ ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ వారాంతంలో మొదలయ్యే తన ఆసియా పర్యటనను బైడెన్‌ కుదించుకున్నారు. జపాన్‌లో జరిగే జీ-7 సదస్సుకు హాజరుకానున్న బైడెన్‌.. ఆ తర్వాత వెళ్లాల్సిన ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆసీస్‌ ప్రధాని అల్బనీస్‌కు.. అమెరికా అధ్యక్షుడు ఫోన్లో సమాచారమిచ్చారు.

Also Read: అమెరికాను భయపెడుతున్న ‘సీలింగ్‌’!

ఈ నెల 19-21 తేదీల్లో జపాన్‌లోని హిరోషిమా వేదికగా జీ-7 సదస్సు జరగనుంది. ఆ తర్వాత 22 నుంచి 24 వరకు సిడ్నీలో క్వాడ్‌ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే బైడెన్‌ తన పర్యటనను వాయిదా వేసుకోవడంతో.. క్వాడ్‌ సదస్సును రద్దు చేస్తున్నట్లు ఆసీస్‌ ప్రధాని అల్బనీస్‌ వెల్లడించారు. ‘‘వచ్చే వారం క్వాడ్‌ సదస్సు జరగట్లేదు. ఈ వారాంతంలో జరిగే జీ-7 సదస్సులోనే క్వాడ్‌ (అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌) దేశాధినేతలు భేటీ అవుతారు. అయినప్పటికీ భారత్, జపాన్‌ ప్రధానులు మోదీ, కిషిదాను మేం మా దేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దీని గురించి వారితో చర్చిస్తున్నాం. అయితే తమ పర్యటనపై భారత్‌, జపాన్‌ ప్రధానుల నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు’’ అని అల్బనీస్‌ వెల్లడించారు.

అయితే, తన ఆసీస్‌ పర్యటనను రద్దు చేసుకున్న బైడెన్‌.. అల్బనీస్‌ను అమెరికాకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు, భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. జూన్‌ 22న మోదీకి బైడెన్ శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇక, జపాన్‌లో జరిగే జీ-7 సదస్సుకు కూడా మోదీ హాజరుకానున్నారు. ఆ సదస్సులో భాగంగా మోదీ, బైడెన్‌ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని