Sri Lanka: ఈ సంక్షోభం ఆరంభం మాత్రమే.. ఆకలితో అలమటిస్తాం..!

రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని.. ప్రజలు ఆకలితో అల్లాడిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Published : 07 Apr 2022 01:46 IST

పార్లమెంట్‌ సభ్యులకు శ్రీలంక స్పీకర్‌ ముందస్తు హెచ్చరిక

కొలంబో: ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఓవైపు ఆహార, ఇంధన కొరత, మరోవైపు నిత్యవసర వస్తువులకు రెక్కలు రావడంతో శ్రీలంక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని.. ప్రజలు ఆకలితో అల్లాడిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోభం వేళ దేశంలో పరిస్థితులపై చర్చించేందుకు పార్లమెంట్‌ సమావేశమైన సందర్భంగా స్పీకర్‌ ఈ ముందస్తు హెచ్చరికలు చేశారు.

‘మునుపెన్నడూ ఎరుగని సంక్షోభం ఇది. కేవలం ఇది ఆరంభం మాత్రమేనని భావిస్తున్నాను. ఆహారం, గ్యాస్‌, విద్యుత్‌ కొరత మరింత క్షీణించనుంది. రానున్న రోజుల్లో ఆహార కొరత తీవ్రతరమై ఆకలితో అలమటించే దుస్థుతి ఎదుర్కోబోతున్నాం’ అని స్పీకర్‌ మహింద యాప అబేయవర్ధనే హెచ్చరించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు పార్లమెంట్‌ సమావేశమైంది. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన స్పీకర్‌.. రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందన్నారు.

రాజీనామా ప్రసక్తే లేదు..

స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఎన్నడూ లేని రీతిలో శ్రీలంక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ విధానాలతో తీవ్ర గ్రహంతో ఊగిపోతున్న పౌరులు తమ ఆందోళనలు ముమ్మరం చేశారు. అధ్యక్ష భవనంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి స్పందించిన ప్రభుత్వం.. ఎట్టిపరిస్థితుల్లోనూ అధ్యక్షుడు రాజీనామా చేసే ప్రసక్తే లేదని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం ఎదుర్కొంటుందని, అధ్యక్షుడి రాజీనామాకు ఎటువంటి కారణం లేదని శ్రీలంక పార్లమెంటులో ప్రభుత్వ విప్‌ జాన్‌స్టన్‌ ఫెర్నాండో స్పష్టం చేశారు. దేశంలో హింసాత్మక సంఘటనలకు ప్రతిపక్ష జేవీపీనే కారణమని ఆరోపించారు. కుట్రపూరిత రాజకీయాలను తమ ప్రభుత్వం సహించదన్న ఆయన.. ప్రజలు హింసాత్మక కార్యక్రమాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని