Published : 14 Apr 2022 18:21 IST

Ukraine Crisis: 5 లక్షల మందిని బలవంతంగా తీసుకెళ్ళారు: జెలెన్‌స్కీ

కీవ్‌: ఉక్రెయిన్‌ పౌరులపై రష్యన్‌ బలగాలు అకృత్యాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు దాదాపు అయిదు లక్షలకుపైగా ఉక్రెనియన్లను రష్యా బలవంతంగా తన భూభాగంలోకి తరలించిందని ఆరోపించారు. బహుశా వారిని అక్కడి మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి ఉంటుందన్నారు. ఎస్తోనియా పార్లమెంట్‌ను ఉద్దేశించి జెలెన్‌స్కీ ఈ మేరకు మాట్లాడారు. తమ పౌరుల డాక్యుమెంట్‌లు, వ్యక్తిగత వస్తువులైన ఫోన్‌ తదితరాలను ఎత్తుకెళ్లేందుకు రష్యా యత్నిస్తోందని చెప్పారు. మరోవైపు రష్యా కుటుంబాలు.. ఉక్రెయిన్‌ చిన్నారులను చట్టవిరుద్ధంగా దత్తత తీసుకునే ప్రయత్నాలూ జరిగాయని తెలిపారు.

‘నేడు అయిదు లక్షల కంటే ఎక్కువ మంది ఉక్రెనియన్లను బలవంతంగా రష్యాలోకి తరలించారు. ఇది ఎంత పెద్ద మొత్తం జనాభానో ఒక్కసారి ఊహించుకోండి!’ అని ఎస్తోనియా చట్టసభ్యులను ఉద్దేశించి అన్నారు. వారు స్వదేశానికి తిరిగొచ్చే ప్రయత్నాలకూ ఆటంకం కలుగుతోందని చెప్పారు. ఈ విషయమై ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని యూరోపియన్ యూనియన్(ఈయూ)కు పిలుపునిచ్చారు. ‘రష్యాపై తీవ్రమైన చర్యలు తీసుకునే శక్తి యూరోపియన్ యూనియన్‌కు ఉంది. ఈయూ దేశాలు తమ అధికారాన్ని ఉపయోగించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌లో రష్యా.. ఫాస్పరస్ బాంబులను ఉపయోగిస్తోందని, తమ పౌరులకు వ్యతిరేకంగా ఉగ్రవాద వ్యూహాలను పన్నుతోందనీ ఆరోపించారు. మాస్కో కట్టడికి.. ఆంక్షల కొనసాగింపే మార్గమని చెప్పారు. ఈయూ తన తదుపరి ఆంక్షల ప్యాకేజీలో.. రష్యన్ బ్యాంకులపై పూర్తి నిషేధం విధించాలని కోరారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని