బెండకాయలు కేజీ రూ.650, కాకరకాయలు కేజీ రూ.1000: ఈ ధరలు ఎక్కడంటే..?

ప్రస్తుతం భారత్‌లో నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. అయితే తాజాగా ఓ నెటిజన్‌ బ్రిటన్‌లో ఉన్న ధరలను వెల్లడిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. 

Published : 24 Jun 2024 10:42 IST

లండన్‌: కాకరకాయలు కేజీ రూ.1000, బెండకాయలు కేజీ రూ.650, ఆరు ఆల్ఫోన్సో మామిడికాయలు రూ.2,400.. ఈ ధరలు వింటుంటే గుండె హడలిపోతుందా..! రేట్లు ఇలా మండిపోతుంటే తినేది ఎలా అని భయమేస్తుంది కదా..! ప్రస్తుతం భారత్‌లోనూ నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నా..ఈ పరిస్థితి ఉన్నది మాత్రం బ్రిటన్లోని(Britain) భారతీయ స్టోర్స్‌లో. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.

దిల్లీకి చెందిన చావి అగర్వాల్ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు. ఇండియన్‌ స్టోర్స్‌లో ఉన్న ధరలు చూసి, ఆమె ఆశ్చర్యపోయారు. ఒక స్టోర్‌లో సరకుల రేట్లు చూపిస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఒక వీడియోను పోస్టు చేశారు. లేస్‌ మాజిక్ మసాలా ప్యాక్‌ భారత్‌లో రూ.20 ఉంటుందని, కానీ లండన్‌లో మాత్రం దాని ఖరీదు రూ.95గా ఉందని చెప్పారు. పన్నీర్‌ రూ.700 ఉందన్న ఆమె.. కూరగాయల ధరలను వెల్లడించారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ ధరలకు నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయింది.

అక్కడి కరెన్సీ(పౌండ్‌ స్టెర్లింగ్‌)ని మన రూపాయల్లో పోల్చి చూస్తే.. ధరలు ఎక్కువగానే ఉంటాయని, అయితే రేట్లు మాత్రం కాస్త ఎక్కువేననే అభిప్రాయం వ్యక్తమైంది. బ్రిటన్ ప్రజలు ద్రవ్యోల్బణంతో ఇబ్బందిపడుతున్న మాట వాస్తవమే కానీ, ఈ వీడియో కాస్త అతిగా ఉందని ఓ నెటిజన్ స్పందించారు. అక్కడ వ్యాపారం ప్రారంభిస్తే బెటరేమో అని మరికొందరు ఫన్నీగా బదులిచ్చారు. వచ్చే నెలలో బ్రిటన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. జీవన వ్యయ సంక్షోభం అక్కడి ప్రజల్ని ఇబ్బందిపెడుతోంది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామన్న హామీతో గద్దెనెక్కిన రిషి సునాక్‌కు మాంద్యం పరిస్థితులు ఎన్నికల వేళ తలనొప్పిగా మారాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు